Tokyo Olympics: లవ్లీనాకు కాంస్యం

విశ్వక్రీడల్లో తొలిసారి బరిలోకి దిగిన భారత బాక్సర్‌ లవ్లీనా బొర్గోహై (69 కేజీలు) కాంస్య పతకం చేజిక్కించుకుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్‌లో లవ్లీనా 0-5తో ప్రపంచ చాంపియన్‌ బుసేనాజ్‌ సుర్మనేలి (టర్కీ) చేతిలో పరాజయం పాలైంది. ఈ విభాగంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సుర్మనేలి పంచ్‌ల ముందు 23 ఏండ్ల లవ్లీనా నిలువలేకపోయింది. బౌట్‌ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన సుర్మనేలి వరుస పంచ్‌లతో విరుచుకుపడగా.. అస్సాం బాక్సర్‌ ఆమెకు దీటుగా బదులివ్వలేకపోయింది. తొలి రెండు రౌండ్‌లలో లవ్లీనా ఫర్వాలేదనిపించగా.. మూడో బౌట్‌లో టర్కీ బాక్సర్‌ విజృంభించింది. ముఖాన్నే లక్ష్యంగా చేసుకుంటూ పంచ్‌లు విసిరింది. ‘ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నా ప్రణాళికలను అమలు చేయలేకపోయా. బ్యాక్‌ఫుట్‌లో ఆడి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదేమో’అని బౌట్‌ అనంతరం చెప్పిన లవ్లీనా.. కాంస్య పతకాన్ని దేశానికి అంకితం ఇస్తున్నట్లు పేర్కొంది. ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున పతకం నెగ్గిన మూడో బాక్సర్‌గా లవ్లీనా చరిత్రకెక్కింది. గతంలో విజేందర్‌ సింగ్‌ (2008 బీజింగ్‌), మేరీకోమ్‌ (2012 లండన్‌) ఈ ఘనత సాధించారు. మరోవైపు మహిళల గోల్ఫ్‌లో అదితి అశోక్‌ చక్కటి ప్రదర్శన చేసింది. బుధవారం తొలి రోజు పోటీలు ముగిసే సరికి అదితి రెండో స్థానంలో నిలువడం విశేషం.