కరోనా ఎదుర్కొనేందుకు 5వేల మందికి శిక్షణ : కేజ్రీవాల్‌

కరోనా థర్డ్‌ వస్తే ఎదుర్కొనేందుకు ఐదువేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కరోనా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లో వైద్య, పారామెడికల్‌ సిబ్బంది కొరతను ఎదుర్కొన్నామన్నారు. ఈ మేరకు ఆరోగ్య సహాయకులను సిద్ధం చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఢిల్లీలోని తొమ్మిది ప్రధాన వైద్య సంస్థల్లో ఐదువేల మంది యువతకు ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఆరోగ్య సహాయకులకు రెండు వారాల పాటు ఐపీ విశ్వవిద్యాలయం శిక్షణ ఇస్తుందని పేర్కొన్నారు. వీరందరూ వైద్యులు, నర్సులకు సహాయలుగా పని చేస్తారని చెప్పారు. వారికి నర్సింగ్‌, పారామెడికల్‌, లైఫ్‌ సేవింగ్‌, ప్రథమ చికిత్సలో ప్రాథమికంగా శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 17 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని.. 18 సంవత్సరాలు నిండి.. 12వ తరగతి పూర్తయిన వారికి అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు.