ఐదువందలకే మినీ ట్రావెలింగ్ కూలర్.. తెలంగాణ చిన్నోడి అద్భుతం

అవసరాల నుంచే కొత్త పరికరాలెన్నో పుట్టుకొస్తాయి. గొనెల శ్రీకాంత్​ విషయం లోనూ అదే జరిగింది. తన చుట్టూ ఉన్న జనాల అవసరం అతడ్ని ఆలోచింపజేసింది. ట్రావెలింగ్​ మినీ కూలర్​ తయారీకి కారణమయ్యింది. అందరి చేత భేష్​ అనిపించుకునేలా చేసింది. కేవలం 2 రోజుల్లోనే 500 రూపాయలతో మినీ కూలర్​ తయారు చేసాడు. వివరాల లోనికి వెళితే ..

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన శ్రీకాంత్​ ఏడేళ్ల క్రితం డిగ్రీ పూర్తిచేశాడు. ఆ తర్వాత సొంతంగా శ్రీ వినాయక ఎలక్ట్రిక్​ అండ్​ వైండింగ్ వర్క్​ షాప్​ పెట్టుకున్నాడు. చిన్నప్పట్నించీ శ్రీకాంత్​కి ఎక్స్​పెరిమెంట్స్​ చేయడం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే రీసెంట్​గా మినీ కూలర్​ తయారుచేశాడు. అది కూడా చాలా తక్కువ ఖర్చుతో తయారుచేశాడు.

ఎలా అంటే..

15 కిలోల ఖాళీ వంట నూనె డబ్బా తీసుకుని దానికి చిన్న మోటార్​ బిగించాడు. రెండున్నర లీటర్ల నీరు లోపలికి బయటికి రావడానికి ప్లాస్టిక్​ వాటర్​ పైపులు కనెక్ట్​ చేశాడు. వాటికి రెండువైపులా ఇనుప జాలీ బిగించి, వాటికి గడ్డిని అమర్చాడు. మోటార్​ తిరగడానికి ​ కరెంట్​ వైరు కనెక్షన్​ ఇచ్చి, ట్రావెలింగ్​ మినీ కూలర్​ తయారుచేశాడు. 12 ఇంచులు పొడవు, 9 ఇంచుల వెడల్పు ఉన్న ఈ కూలర్​ ఎక్కడికైనా వెంటతీసుకెళ్లొచ్చు. ముఖ్యంగా ఫంక్షన్లు, పార్టీలకి, హాస్పిటల్స్​లో రోగులకి, పేదలకి ఈ కూలర్​ చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నాడు శ్రీకాంత్. తగిన ప్రోత్సాహం అందిస్తే మరిన్ని ప్రయోగాలు చెయడానికి రెడీ అంటున్నాడు.