రామతీర్థంలో త్రిదండి చినజీయర్‌ స్వామి పర్యటన

విజయనగరంలోని రామతీర్థంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా రామతీర్థంలోని బోడికొండపై ఉన్న రామాలయాన్ని చినజీయర్‌ స్వామి దర్శించుకున్నారు. కొండపై రాముడి విగ్రహ ధ్వంసం ఘటనా స్థలాన్ని స్వామీజీ పరిశీలించారు. ఆలయ పరిసరాలను, విగ్రహం లభించిన నీటి కొలనును కూడా సందర్శించారు చినజీయర్‌ స్వామి. విగ్రహ ధ్వంసం ఘటనకు సంబంధించిన వివరాలను ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఇటీవల ఏపీలో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులపై ఆయన మండిపడ్డారు. ఆలయాల్లో విగ్రహాలకు రక్షణ కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్వేది రథం దగ్ధం, రామతీర్థం ఘటనలే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుచేశారు.