వైకాపా నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారు

  • జనసేన నేత గురాన అయ్యలు

విజయనగరం: జిల్లాలో జరిగిన యువగళం, రా..కదిలి రా సభలకు హాజరైన ప్రజానీకాన్ని చూసి వైకాపా నాయకులు మతిభ్రమించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి తప్పదనే భయంతో వైకాపా నాయకులు కులాల మధ్య చిచ్చు రేపుతున్నారని ఆరోపించారు. 2004 లో కాంగ్రెస్ హయాంలో సాంబశివరాజు, శత్రుచర్ల, సుజయ్ పోటీ చేసినప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతోందని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. నిజంగా బీసీలపై ప్రేమ వుంటే విజయనగరం నియోజకవర్గంలో బీసీలకు సీటు ఇచ్చే దమ్ము వుందా అని ప్రశ్నించారు. బొబ్బిలిలో అభివృద్ధి చేశాం అని గొప్పలు చెప్పడం విడ్డూరంగా వుందన్నారు. బొబ్బిలి జగనన్న కాలనీల్లో కనీస సదుపాయాలు కూడా కల్పించలేకపొయారని, బొబ్బిలి పట్టణంలో వేసిన రోడ్లు ఆరు నెలలుకే మళ్లీ శిథిలావస్థకు చేరుకున్నాయని ఎద్దెవా చేశారు. మంత్రి బొత్స, చిన్నశ్రీనులకు దమ్ముంటే బొబ్బిలి నియోజకవర్గంలో బేబీనాయనపై పోటీ చేయాలని సవాల్ చేశారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా 2024 లో జనసేన – టీడీపీ కూటమి విజయాన్ని అడ్డుకోలేరన్నారు. ప్రజాపాలన రావడం ఖాయమన్నారు.