ద్వారంపూడిని ఓడించేందుకు వీరమహిళలు సిద్ధం

కాకినాడ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల జనసేన వీర మహిళలు కన్నెర్ర చేశారు. పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని చెప్పడం కాదని ముందు అతన్ని కాకినాడ సిటీ నియోజకవర్గంలో నగర ప్రజల సహకారంతో వీర మహిళలు ఓడించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ లాంటి సేవ సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిపై ఆసందర్భంగా వ్యాఖ్యలు చేసిన ద్వారంపూడి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సిద్ధార్థ నగర్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనకు చెందిన పార్టీ కార్యాలయంలో వీర మహిళలు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ నగర మాజీ మేయర్ పోలసపల్లి సరోజ విలేకరులతో మాట్లాడారు. ద్వారంపూడి నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. కాకినాడ నగర అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కేవలం పవన్ కళ్యాణ్ ని విమర్శించడాన్ని తప్పుపట్టారు. పవన్ జిల్లాలో ఎక్కడ పోటీ చేస్తే తాను ఇన్చార్జి బాధ్యతలు తీసుకుని ఓడిస్తానని ద్వారంపూడి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముందు కాకినాడ నగరంలో ద్వారంపూడి గెలవాలని వారు ఛాలెంజ్ చేసారు. కాకినాడ అభివృద్ధిపై ఎటువంటి దృష్టి పెట్టకుండా కేవలం రాజకీయ అసందర్భ వ్యాఖ్యలతో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. జనసేన అధినేత పవన్ ని విమర్శించే స్థాయి ద్వారంపూడితో పాటు మంత్రి వెల్లంపల్లికి కూడా లేదన్నారు. ఇక మీదట తమ నాయకుడి పై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుకలు కోస్తామని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ పై వైకాపాకు రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలే బుద్ధి చెబుతారని, అలాగే యువతను మాదకద్రవ్యాలకు అలవాటు చేసి వారి భవిష్యత్తును ఎలా కాలరాస్తున్నారో ప్రజలందరికీ తెలుసని ఉభయ గోదావరి జిల్లాల మహిళా రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీమతి చల్లా లక్ష్మీ అన్నారు. కాకినాడ నందు రేషన్ బియ్యం అక్రమ రవాణా, తదితర చీకటి వ్యాపారాలు కాకినాడ ప్రజలు గమనిస్తున్నారని మరొక మహిళా రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీమతి ముత్యాల జయలక్షి పేర్కొన్నారు. ద్వారంపూడికి డిపాజిట్లు కూడా రాకుండా చూసే పూచీ మా జనసేన వీరమహిళలది అని తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుంకర కృష్ణవేణి హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేన వీర మహిళలు పిల్లా రమ్య జ్యోతి, పాఠంశెట్టి కాశీరాణి, కొల్లాబత్తుల సూర్యకుమారి, దారపు శిరీష, బోడపాటి మరియా, బట్టి లీల,జనసైనికులు మరియు తదితరులు పాల్గొన్నారు.