గ్రేటర్ ఫలితాల పై విజయశాంతి స్పందన…

తాజాగా వెలువడిన గ్రేటర్ ఫలితాల పై విజయశాంతి స్పందిస్తూ.. కనీసం 100 డివిజన్లు ఖాయమని జబ్బలు చరిచిన టీఆర్ఎస్ చివరికి మొత్తం స్థానాల్లో దాదాపు మూడోవంతుకు సరిపెట్టుకోవాల్సి వచ్చిందని మాజీ ఎంపీ విజయశాంతి ఎద్దేవా చేశారు. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్, ఈసారి ఎన్నికల్లో 44 స్థానాలు కోల్పోయి 55 స్థానాలకే పరిమితం అయింది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై విజయశాంతి వ్యాంగ్యాస్త్రాలు విసిరారు. గ్రేటర్ ఫలితాలపై తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతా ద్వారా స్పందించారు.

”కనీసం 100 డివిజన్లు ఖాయమని జబ్బలు చరిచిన టీఆరెస్ చివరికి మొత్తం స్థానాల్లో దాదాపు మూడోవంతుకు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గులాబీ నేతల హామీలు నీటి మీద రాతలేనని ఓటర్లు బాగా గ్రహించారు. విపక్షాలకు అవకాశమివ్వకూడదనే కుట్రతో… వరుస సెలవులున్నప్పుడు పోలింగ్ శాతం తగ్గుతుందని తెలిసీ… రోజుల వ్యవధిలో ఎన్నికలకు వెళ్ళారు.

కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాల్లో తప్పుల సవరణకు సమయం ఇవ్వలేదు. ఇతర ప్రాంతాలకు వెళ్ళినవారు, మృతుల పేర్లు జాబితాల్లో దర్శనమిచ్చాయి. అనుభవం లేని సిబ్బందితో తూతూ మంత్రంగా ఎన్నికలు జరిపేశారు. కాస్త తక్కువ స్థానాలు దక్కినా మేయర్ పదవికి అండగా ఎక్స్‌అఫీషియో ఓట్లున్నాయని టీఆరెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు.

తీరా చూస్తే ఎంఐఎం మద్దతు లేకుండా టీఆరెస్‌కి మేయర్ సీటు దక్కేలా లేదు. ఇన్నాళ్ళూ కవలల్లా ఉంటూ వచ్చిన ఈ పార్టీలకు కమల పరీక్ష ఎదురైంది. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతో అవసరం లేదని టీఆరెస్ నేతలు… తల్చుకుంటే గులాబీ సర్కారును 2 నెలల్లో కూల్చుతామని ఎంఐఎం నేతలు బీరాలు పలికారు.

మేయర్ పీఠం విషయంలో ఇద్దరూ అదే మాటమీద ఉంటారా? కాదంటే… మేయర్ పదవి దక్కకపోయినా ఎంఐఎంతో కలిసేది లేదని… హంగ్ కార్పోరేషన్ రానివ్వండి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమని టీఆరెఎస్ చెప్పాలి. కవలల అసలు రంగు బయటపడే సమయం ఇప్పుడు ఆసన్నమైంది” అని విజయశాంతి తన ఫేస్‌బుక్ ఖాతాలో రాసుకొచ్చారు.