పవన్ కళ్యాణ్ సమక్షంలో యువగళాన్ని వినిపించండి

  • గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు, ఈ నెల 12 న ఉద్యమాల గడ్డ శ్రీకాకుళంలోని రణస్థలం వేదికగా జరగనున్న యువశక్తి బహిరంగ సభలో సామాన్య యువతీయువకులు పవన్ కళ్యాణ్ సమక్షంలో తమ గళాన్ని వినిపించేందుకు అవకాశం కల్పించారని, ఈ బృహత్తర అవకాశాన్ని రాష్ట్ర యువత వినియోగించుకోవాలని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి కోరారు. బుధవారం స్థానిక శ్రీనివాసరావుతోటలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపుమేరకు యువగళం గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న అపరిష్కృత విధానాలతో ఎన్నో ఏళ్లుగా యువశక్తి నిర్వీర్యం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో యువత తమ సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారని, అలాంటి యువతకు పవన్ కళ్యాణ్ ఒక ఆశాదీపంలా కనిపిస్తున్నారన్నారు. నాయకులు మాత్రమే కాకుండా సామాన్య యువతీయువకులు సైతం తమ గళాన్ని, తమ భావాల్ని, ఎన్నో ఏళ్లుగా గుండెల్లో దాచుకున్న వేదనని ప్రపంచానికి తెలియచేసే గొప్ప అవకాశాన్ని జనసేన పార్టీ కల్పిస్తుందన్నారు. యువత ఎదురుకుంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తమ దగ్గరున్న సూచనలు, భవిష్యత్ ప్రణాళికలు, వర్తమాన రాజకీయాలపై కూడా యువత తమ గళాన్ని వినిపించవచ్చన్నారు. ఇందుకు గానూ ఈ నెల ఐదు నుంచి ఎనిమిదవ తారీఖు మధ్యలో 0806993222 నెంబర్ కు ఫోన్ చేసి తాము ఏ విషయం మీద మాట్లాడదలుచుకున్నారో రికార్డ్ చేసి పంపవచ్చన్నారు. అదే విధంగా vrwithjspk@janasenaparty.org అనే ఈ-మెయిల్ ద్వారా కూడా మీ వాయిస్ రికార్డ్ పంపవచ్చని, ఈ బృహత్తర అవకాశాన్ని రాష్ట్రంలోని యువతీ యువకులు ఉపయోగించుకోవాలని ఆళ్ళ హరి కోరారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు బండారు రవీంద్ర, మెహబూబ్ బాషా, డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, రాష్ట్ర రెల్లి యువనేత సోమి ఉదయ్, రాజశేఖర్, నండూరి స్వామి, బాలాజీ, సుబ్బారావు, నాగూర్ తదితరులు పాల్గొన్నారు.