కేంద్రానికి రైతు నేతల హెచ్చరికలు

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే దేశ వ్యాప్తంగా రైల్వే ట్రాక్‌లను బ్లాక్‌ చేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. కేంద్రానికి గురువారం వరకు అల్టిమేటం ఇచ్చామని, ప్రధాని మోదీ తమ మాట వినకపోతే, చట్టాలను వెనక్కి తీసుకోక పోతే రైల్వే ట్రాక్‌లను బ్లాక్ చేస్తామని రైతు నాయకుడు బూటా సింగ్ తెలిపారు. కేవలం పంజాబ్‌లో మాత్రమేగాక రైతులంతా దేశవ్యాప్తంగా రైలు పట్టాల వద్ద నిరసన తెలుపుతారని అన్నారు. గురువారం నాటి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దీనిపై సన్యుక్ట్ కిసాన్ మంచ్ ఒక తేదీని నిర్ణయించి ప్రకటిస్తుందని తెలిపారు.

ఈ నెల 12న టోల్‌ గేట్లను అడ్డుకుంటామని, డీసీ కార్యాలయాల వద్ద ధర్నా చేస్తామని రైతు నేతలు చెప్పారు. జోధ్‌పూర్‌-ఢిల్లీ రహదారిని అడ్డుకుంటామన్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటే కేంద్రానికి వచ్చే నష్టం ఏమిటని రైతు నేతలు ప్రశ్నించారు. వ్యాపారుల కోసం చట్టాలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని భారతీయ కిసాన్ యూనియన్ (ఆర్) నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ తెలిపారు. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోనిదని, దానికి సంబంధించిన చట్టాలు చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు.