అన్ని రకాల క్రికెట్ కు గుడ్ బై చెప్పిన వాట్సన్

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు తన ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కు తెలిపాడు. ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆఖరి మ్యాచ్‌ను ఆడేసిన తర్వాత.. అన్ని రకాల క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్టు వాట్సన్‌ జట్టు సహచరులకు, ఫ్రాంచైజీకి చెప్పినట్టు సమాచారం. తన నిర్ణయం వెల్లడించే సమయంలో భావోద్వేగానికి గురయ్యాడని, చెన్నైకి ఆడడం గౌరవంగా భావిస్తున్నట్టు వాట్సన్‌ చెప్పాడని జట్టు అధికారి పేర్కొన్నాడు. 2016లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 39 ఏళ్ల వాట్సన్‌ అప్పటి నుంచి వివిధ టీ20 లీగ్‌ల్లో ఆడుతున్నాడు. అయితే గతేడాది బిగ్‌బాష్‌కు కూడా గుడ్‌బై చెప్పిన అతను తాజాగా ఐపీఎల్‌కు కూడా దూరమయ్యాడు. 2018లో సీఎస్‌కే వాట్సన్‌ను కొనుగోలు చేసింది. సీఎస్‌కే తరఫున అతను 43 మ్యాచ్‌లు ఆడాడు. రెండేళ్ల క్రితం ఐపీఎల్‌ ఫైనల్లో వాట్సన్‌ సెంచరీతోనే జట్టు మూడో టైటిల్‌ సాధించింది. గతేడాది కూడా ఫైనల్లో అర్ధసెంచరీ చేసినా ఒక పరుగు తేడాతో చెన్నై ఓటమిపాలైంది. సీఎ్‌సకేకు ముందు రాజస్థాన్‌, బెంగళూరు జట్ల తరఫున వాట్సన్‌ ఆడాడు. ఓవరాల్‌గా 2008 నుంచి ఇప్పటిదాకా వాట్సన్‌ 145 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 3,874 పరుగులు చేయగా, ఇందులో 4 శతకాలున్నాయి. 92 వికెట్లు తీశాడు. మరోవైపు ధోనీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వచ్చే సీజన్‌ నుంచి చెన్నై సహాయక బృందంలో ఉండే అవకాశం లేకపోలేదు.

కాగా, తన రిటైర్మెంటు నిర్ణయాన్ని వాట్సన్ అధికారికంగా ప్రకటించకపోయినా, సూపర్ కింగ్స్ యజమానులకు తెలియజేసినట్టు సమాచారం. ఈ సీజన్ లో వాట్సన్ పేలవ ప్రదర్శన కనబరిచాడు.  11 మ్యాచ్ లు ఆడినా, స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ లేకపోవడంతో వాట్సన్ రిటైర్మెంటు నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది.