హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నాం: పవన్ కల్యాణ్

ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైకోర్టును జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పు హర్షణీయమని పవన్ అన్నారు.

స్థానిక స్వపరిపాలనకు ఈ తీర్పు ఊపిరిపోసిందని చెప్పారు. ఏడాది క్రితం నోటిఫికేషన్ జారీ చేసి, ఆ తర్వాత కరోనా కారణంగా ఎన్నికలను రద్దు చేశారని తెలిపారు. అయితే అదే నోటిఫికేషన్ పై ఏడాది తర్వాత ఎన్నికలను నిర్వహించడం అంటే ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కినట్టేననని అన్నారు.

ఏప్రిల్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం తలపెట్టినప్పుడే… జనసేన తీవ్రంగా వ్యతిరేకించిందని పవన్ చెప్పారు. ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ జారీ చేయాలని… పోటీ చేసే అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలని డిమాండ్ చేశామని తెలిపారు.

అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు వెళ్లిందని… మొండిగా ఎన్నికలకు వెళ్లడంతో జనసేన హైకోర్టును ఆశ్రయించిందని చెప్పారు. ఎన్నికలను రద్దు చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నామని తెలిపారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం పంతాలకు, పట్టింపులకు పోకుండా… తగిన సమయంలో తాజా నోటిఫికేషన్ జారీ చేసి, ఎన్నికలను నిర్వహించాలని కోరుతున్నామని అన్నారు.