కృష్ణా, గోదావరి జలాల్లో మన హక్కును వదులుకోము…కేసీఆర్

కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ విషయంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ ముందుకు వచ్చింది. అగస్టు 5వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కౌన్సిల్ భేటీలో హాజరయ్యేలా బాధ్యతలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు గోదావరి నదీ యాజమాన్య సంస్థ  సూచించింది. అయితే తమను సంప్రదించకుండానే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖనే భేటీ ఎజెండాను, తేదీని ఖరారు చేయడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

గురువారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి కోసం అనేక కష్టాలు అనుభవించామని, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా, గోదావరి జలాల్లో మన హక్కును, నీటి వాటాను కాపాడుకొని తీరాలని కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం నిర్ణయించింది. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని, ఎంతటి పోరాటానికైనా తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అని కేసీఆర్ పేర్కొన్నారు.

నిజానికి రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు సీఎంలు కేసీఆర్,జగన్ మొదట్లోనే ఒక అవగాహనకు వచ్చారు. అయితే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయంలో జగన్ కేసీఆర్‌ను సంప్రదించకపోవడం ఇరు రాష్ట్రాల సంబంధాలపై ప్రభావం చూపేదిగా మారింది. అయినప్పటికీ కేసీఆర్ సంయమనంతోనే వ్యవహరించారు. ఇప్పుడు,ఎప్పుడూ కలిసే ముందుకు వెళ్తామని… అనోన్యంగానే కలిసి ఉంటామని స్పష్టం చేశారు. అయితే తాజాగా కేంద్రం జోక్యంతో ఇరువురు సీఎంలు ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.