మేం చాలా గొప్ప జంటగా నిలుస్తాం: రానా

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి మరికొద్ది రోజుల్లో వివాహo చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. రానా-మిహికాల వివాహం ఆగస్టు 8న జరగనుంది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. తెలుగు, మార్వాడీ సాంప్రదాయాలలో ఈ పెళ్లి తంతు నిర్వహించనున్నారట. ప్రస్తుతం కోవిడ్-19 దృష్ట్యా ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ ఈ పెళ్లికి పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించాలని సురేష్ బాబు భావిస్తున్నారట.  ఇప్పటికే వీరి పెళ్లి పత్రిక తెగ ట్రెండ్‌ అవుతోంది. ఈ క్రమంలో తనకు కాబోయే శ్రీమతి మిహికా బజాజ్‌ గురించి, వారి బంధం గురించి పలు ఆసక్తికర విషయాలను రానా ఒక ఇంటర్వ్యూలో మీడియాతో పంచుకోవడం జరిగింది.

 ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. ‘మిహికా, మేం ఒకే ప్రాంతంలో ఉండేవాళ్లం. మా ఇంటి నుంచి తన ఇంటికి కేవలం మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే. వివాహం చేసుకోవడానికి నేను చాలా వింతైన సమయాన్ని ఎన్నుకున్నాను’ అన్నారు. ‘తను చాలా మంచిది. మేం చాలా గొప్ప జంటగా నిలుస్తాం. ఒకరినుంచి ఒకరం సానుకూల అంశాలను స్వీకరిస్తాం. మిహికాతో వివాహం జరగడం అనేది నా వ్యక్తిగత జీవితంలో అత్యంత ఉత్తమమైన సమయం. ఈ ఆలోచన ఎంతో అద్భుతంగా ఉంది’ అన్నారు.