ఆరునూరైనా టెన్త్ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం: మంత్రి క్లారిటీ !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పందించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉందని విద్యార్థుల భవిష్యత్తు భద్రత విషయంలో సీఎం జగన్ సూచనల మేరకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటుందని అన్నారు. పరీక్షల విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. 10వ తరగతి ఇంటర్ పరీక్షలకు ఇప్పటికే షెడ్యూల్ సిద్ధం చేశామని స్పష్టం చేశారాయన. అయితే రాబోయే రోజుల్లో పరిస్థితులకు అనుగుణంగా పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఎట్టిపరిస్థితుల్లో విద్యార్థులకు ఇబ్బందులు రానివ్వమని మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పారు. అలాగే 10వ తరగతి ఇంటర్ పరీక్షలను రద్దు చేసే ప్రసక్తి లేదు అన్నారు. అనుకూల పరిస్థితులు తరువాత పరీక్షలు నిర్వహిస్తాం. పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలనే ప్రతిపక్ష పార్టీల డిమాండ్ సరికాదని అన్నారు. లోకేష్ చదువుకోవడానికి అప్పుడు సత్యం కంప్యూటర్స్ సంస్థ ఉంది.

పేద విద్యార్దులకు అటువంటి సహాకారం లేదు. పదోవ తరగతే ఉన్నత చదువులకు ఉద్యోగాలకు ప్రమాణం. పరీక్షలు ఇప్పటికిప్పుడు నిర్వహిస్తామనడంలేదు అని తెలిపిన మంత్రి ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి అని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రిలో మొక్కలు నాటారు రాష్ట్ర విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.

ఈ సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో సీబీఎస్ఈ టెన్త్ ఇంటర్ పరీక్షలు రద్దు చేసింది. ఆ తర్వాత తెలంగాణలోనూ పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం పదోవ తరగతే ఉన్నత చదువులకు ఉద్యోగాలకు ప్రమాణం అని ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్షలు పెట్టడానికే మొగ్గుచూపుతోంది.