డిసెంబర్ 22 న టిడ్కో చైర్మన్ ని సన్మానిస్తాం: ఆళ్ళ హరి

  • కట్టిన ఇళ్ళు ఇవ్వకుండా, కడతానన్న ఇళ్లు కట్టకుండా ఉండటమే సంక్షేమమా?
  • వైసీపీ నేతల అవినీతిని ప్రజల ముందుంచిన జనసేన
  • వైసీపీ నేతల మోసాన్ని పేదలు గ్రహించటంతో మతిభ్రమించి మాట్లాడుతున్న వైసీపీ నేతలు
  • జనసేన పట్ల ప్రజల్లో సానుకూలత.. రానున్న ఎన్నికల్లో చారిత్రక తీర్పు ఇవ్వనున్న ప్రజలు
  • జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: పేదలకు గత ప్రభుత్వం కట్టించిన టిడ్కో గృహాలను సీఎం ఆదేశాల మేరకు లబ్ధిదారులకు డిసెంబర్ 21 న కేటాయిస్తున్నామని టిడ్కో గృహాల చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ చెప్పటాన్ని స్వాగతిస్తున్నామని, ఈ లక్ష్యాన్ని నెరవేర్చిన మరుసటి రోజు డిసెంబర్ 22 న జనసేన పార్టీ తరుపున టిడ్కో చైర్మన్ ను ఘనంగా సన్మానిస్తామని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా జనసేన నేతలు టిడ్కో గృహాలను సందర్శించిన నేపథ్యంలోనే మూడేళ్ళుగా మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వంలోనూ, అధికారుల్లోనూ చలనం వచ్చిందని ఆయన అన్నారు. బుధవారం ఆళ్ళ హరి మీడియాతో మాట్లాడారు. మాది సంక్షేమ ప్రభుత్వం అని పదే పదే గొప్పలు చెప్పుకోవటం మినహా ఈ వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ప్రత్యేకంగా ఒనగూరిన ప్రయోజనం ఏమీలేదని విమర్శించారు. కట్టిన ఇల్లు ఇవ్వకుండా కట్టి ఇస్తానన్న ఇల్లు కూడా కట్టకుండా పేదల జీవితాలతో చెలగాటమాడే ఈ ప్రభుత్వానికి పేదల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రభుత్వం నిర్మిస్తుంది జగనన్న కాలనీళ్లు కాదు జగనన్న ఊర్లు అంటూ ఊదరకొట్టిన వైసీపీ నేతలు చివరకు వాటిని జగనన్న వల్లకాడ్లుగా మార్చారని ధ్వజమెత్తారు. జగనన్న కాలనీల్లో వేల కోట్లు దోచుకున్న వైసీపీ నేతల అవినీతిని జనసేన పార్టీ ప్రజల కళ్ళముందు పెట్టడంతో కల్లుతాగిన కోతిలా వైసీపీ మంత్రులు విమర్శలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. జగనన్న కాలనీల పేరుతో పేదల్ని మోసం చేసి మరలా ఎన్నికల్లో గెలుద్దాం అనుకున్న వైసీపీ నేతల ఆశలపై జనసేన నీళ్లు చల్లిందని దీంతో వైసీపీ నేతలకు మతిభ్రమించిందన్నారు. జనసేన అసలు రాజకీయ పార్టీనే కాదని అంటున్నారని, మరి జనసేన పేరు వింటేనే వైసీపీ నేతలకు గుండెదడ ఎందుకొస్తుందన్నారు. వైసీపీ నేతల మోసాల్ని ప్రజలు గ్రహించారని, ఇలాంటి వారికా ఒక్క చాన్స్ ఇచ్చిందన్న అపరాధభావం ప్రజల్లో నెలకొందన్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ సిద్దాంతాల పట్ల, పవన్ కళ్యాణ్ భావజాలం పట్ల ప్రజల్లో సానుకూలత ఏర్పడిందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆళ్ళ హరి అన్నారు.