జగన్ రెడ్డిని చూసి బయపడేదెలే: నాదెండ్ల మనోహర్

*ఎప్పుడో ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్ పేరుతో తాళాలు వేస్తారా?
*జనసేన అండగా ఉంటుంది
*కాకినాడలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి ని, వైసీపీనీ చూసి భయపడాల్సిన అవసరం లేదని, జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. ప్రజలు కోరుకునే విధంగా ప్రభుత్వం పాలన చేయాలి తప్ప అధికారాన్ని, పదవులను అడ్డుపెట్టుకొని ప్రజలను భయపెట్టాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి వర్గాన్ని దెబ్బకొడుతుందని, ముఖ్యంగా సామాన్యుడిని ఇబ్బందిపెడుతుందని అన్నారు. మత్స్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా కాకినాడ దుమ్ములపేట ప్రాంతంలో పర్యటించినప్పుడు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… “రాష్ట్రంలో అధ్వాన్న పరిస్థితి నెలకొంది. వైసీపీపై నమ్మకంతో 151 మంది శాసనసభ్యులను గెలిపిస్తే… వాళ్లు చేసిన ద్రోహం, సామాన్యులను పెట్టిన ఇబ్బందులు బాధ కలిగించాయి. చెత్తకు రూ. 60 పన్ను ఎందుకని ఈరోజు మహిళలు రోడ్ల మీదకు వచ్చి ప్రశ్నిస్తున్నారు. ఓటిఎస్ పేరుతో ఎప్పుడో ఇచ్చిన ఇళ్లకు తాళాలు వేస్తున్నారు. ఇందుకు వ్యతిరేకంగా మహిళలు గళం విప్పుతున్నారు. ఓటిఎస్ విధానాన్ని జనసేన పార్టీ తరపున తప్పకుండా వ్యతిరేకిస్తాం. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఉద్యోగులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తాం, జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి ఈరోజు ఎక్కడ కనిపించకుండా పోయారు.

*మత్స్యకారుల బాధలు పట్టవా?

వేటకు వెళ్లే సమయంలో మత్స్యకారులు దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైతే రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు… ఇప్పుడు ఆ వాగ్ధానాన్ని గాలికొదిలేశారు. భయపెట్టి, బెదిరించి, మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఇకపై ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. కేవలం మత్స్యకారుల సమస్యలపై ప్రస్తావించడానికే ఈ నెల 20న నరసాపురంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సమస్యలపై మాట్లాడమే కాకుండా వాటిపై పార్టీ విధానాలను కూడా వెల్లడిస్తారు. అలాగే మత్స్యకారుల అభ్యున్నతికి పార్టీ తరపున భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నామనే విషయాలు వెల్లడిస్తారని” అన్నారు. కాకినాడ నగర నియోజక వర్గంలోని దుమ్ములపేట, సూర్యనారాయణపురం, తిలక్ రోడ్, జగన్నాథపురం ప్రాంతాల్లో యాత్ర సాగింది. యాత్ర తొలిరోజు జగన్నాథపురం దగ్గర ముగిసింది. పి.ఎ.సి. సభ్యులు ముత్తా శశిధర్, పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, కోన తాతారావు, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ నాయకర్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేశ్, కాకినాడ నగర అధ్యక్షులు శ్రీ సంగిశెట్టి అశోక్, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, అసెంబ్లీ నియోజక వర్గాల పార్టీ ఇంఛార్జులు, విశాఖపట్నం, నెల్లూరు జిల్లా నాయకులు, మత్స్యకార వికాస విభాగం సభ్యులు పాల్గొన్నారు.

*చైతన్యం రగిల్చిన పాదయాత్ర

మత్స్యకార వికాస విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన మత్స్యకారుల అభ్యున్నతి యాత్ర తొలి రోజు ముగిసింది. కాకినాడ రూరల్ నియోజకవర్గం సూర్యారావుపేటలో ప్రారంభమైన యాత్ర… వలసపాకల, వాకలపూడి, గంగరాజు నగర్, దుమ్ములపేట, డైరీఫారం మీదుగా సూర్యనారాయణపురం, తిలక్ స్ట్రీట్ చేరుకొని మెయిన్ రోడ్డులో ముగిసింది. తొలిరోజు దాదాపు 20 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. యాత్రలో భాగంగా మత్స్యకార ప్రాంతాల్లో తిరిగిన మనోహర్ వారు పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం చేస్తున్న మోసం గురించి వివరించారు. సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డప్పు చప్పుళ్లు, బాణాసంచా వెలుగుల్లో కోలాహలంగా జరిగిన యాత్రలో వేలాదిగా మత్స్యకారులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. అభిమానంతో పూలవర్షం కురిపించారు. మత్స్యకార మహిళలు హారతులు పట్టి ఆహ్వానించారు.