పోలవరం ప్రాజెక్ట్ నిధుల సాధనలో ఎందుకింత అలసత్వం?

*28 మంది ఎంపీలతో వైసీపీ సాధించింది శూన్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకోవడంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. జాతీయ ప్రాజెక్ట్ హోదా ఉన్న పోలవరానికి 2022-23 బడ్జెట్లో కేటాయింపులు కనిపించలేదంటే వైసీపీ తరఫున ఉన్న 22మంది లోక్ సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఢిల్లీలో ఏం సాధించినట్లు? ఈ పరిస్థితి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసినప్పుడుగానీ, సంబంధిత అధికారులతో చర్చలలో పోలవరం ప్రాజెక్ట్ గురించి కనీసం ప్రస్తావిస్తున్నారా అనే సందేహం వస్తోంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ప్రకటనల్లో మాత్రం పోలవరం గురించి అడిగాం అంటారు. కేంద్ర బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరవాత కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్ట్ కోసం అందుకున్న నిధులు కేవలం రూ.5163.2 కోట్లు మాత్రమే. ఈ విధంగా అయితే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తవుతుంది? యమునకు ఉప నదులైన కెన్-బెత్వా ప్రాజెక్ట్ కోసం రూ.44వేల కోట్లు ప్రతిపాదనలు ఈ బడ్జెట్లో ఉన్నాయి. అంటే కేంద్రం జలవనరుల రంగానికి సానుకూలంగా నిధులు ఇస్తోంది. సాధించడంలోనే వైసీపీ ప్రభుత్వం అలసత్వం కనిపిస్తోంది. కేంద్రం దగ్గర రాష్ట్ర అవసరాలను, ఇక్కడి ప్రజల ప్రయోజనాలను…. అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా బహుళార్ధ సాధకమో వివరించి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 30.7 లక్షల ఎకరాలకు సాగు అవసరాలు, 28 లక్షల మందికి తాగు అవసరాలు తీరుతాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ ఎంపీలకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అంచనా వ్యయం రూ.47,725 కోట్ల మేరకు పెంచడానికి సాంకేతిక సలహా మండలి అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి నిధులు తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పం ఉన్నట్లు లేదు. 2021 డిసెంబర్ 1వ తేదీ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేసి, 2022 ఖరీఫ్ పంటకు నీళ్ళు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ మాటి మరచిపోయింది. పునరావాసం, పరిహారం ప్రక్రియ ఇంకా 80శాతం మిగిలే ఉంది. ఇందుకోసం ఇంకా దాదాపుగా రూ.25 వేల కోట్లు అవసరం అని అంచనా ఉంది. ప్రాజెక్ట్ నిర్మాణాలు వివిధ దశల్లోనే ఉన్నాయి… కీలకమైన ఎర్త్ కామ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ఇంకా మొదలు కాలేదు. పునరావాస, పరిహార ప్రక్రియ ముందుకు సాగడం లేదు. నిధుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వ వైఖరి చూస్తుంటే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తవుతుందో కూడా అంచనాలకు అందటం లేదు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.