మహిళల IPL‌.. తేదీలు విడుదల

కరోనా కారణంగా వాయిదా పడిన పురుషుల ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 4 నుంచి అమ్మాయిల ఐపీఎల్ జరుగనుంది. బీసీసీఐ దానికి ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ అని పేరు పెట్టింది. ఈ మేరకు ఈరోజు షెడ్యూల్ విడుదల చేసింది.

బీసీసీఐ తాజాగా ఏఏ తేదీల్లో మ్యాచులు జరుగుతాయో ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత సీజన్ లో ఈ లీగ్ లో కేవలం 3 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. కానీ ఈ ఏడాది మాత్రం 4 జట్లతో ఈ లీగ్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలి చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా 3 జట్లతోనే బీసీసీఐ మినీ ఐపీఎల్ నిర్వహిస్తుంది. ఈ మూడు జట్లకు.. వెలాసిటీ జట్టుకు మిథాలీ రాజ్, సూపర్ నోవాస్ జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్, ట్రైల్ బ్లేజర్స్ జట్టుకు స్మృతీ మంధనా కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.  ఇక పురుషుల ఐపీఎల్ కు ఏ విధమైన కరోనా నియమాలు వర్తిస్తాయో మహిళల ఐపీఎల్ కు కూడా అవే నియమాలు వర్తిస్తాయి.

ఈ మ్యాచ్‌లు నవంబరు 4 నుంచి 9వ తేదీ వరకు దుబాయ్‌లో జరుగనున్నాయి. ఈ ఐపీఎల్‌కి ఎంపికైన మహిళా క్రికెటర్లు ముంబయి రావాలంటూ బోర్డు సమాచారం అందించింది. వీరిని వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నారు. మహిళల ఐపీఎల్‌లో మూడు లీగ్ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు.