వైసీపీ నాయకులు రెచ్చగొట్టే పనులు మానుకోవాలి: రేఖ గౌడ్

ఎమ్మిగనూరు నియోజకవర్గం: పేదలకు పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం అని పేరుతో వైసీపీ నాయకుల వేయించిన ఫ్లెక్సీలు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మెగా అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రేఖా గౌడ్ అన్నారు. వైసీపీ వారు వేసిన బ్యానర్లకు నిరసనగా సోమప్ప సర్కిల్ నందు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్సై మస్తాన్ వల్లి, మరియు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి లకు ప్లెక్సీలు తొలగించాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రేఖ గౌడ్ మాట్లాడుతూ.. ఫ్లెక్సీలు పర్యావరానికి హానికరం అంటూ ఫ్లెక్సీలు నిషేధం అనే జీవో విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఇలాంటి ప్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వలన మెగా అభిమానులను, జనసైనికులను అనవసరంగా రెచ్చగొడుతున్నారని ఇలాంటి ఫ్లెక్సీల వల్ల ఎలాంటి ఉపయోగం ఉన్నదని, ఈ ఫ్లెక్సీలు మీద పెట్టే దృష్టి పాలనపై పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే విషయంపై పెట్టాలని, 45 ఏళ్ళు అయిన వితంతువులకి పెన్షన్ ఇచ్చే విషయంపైన దృష్టి పెట్టాలని అన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఫ్లెక్సీలు మళ్ళీ ముద్రిస్తే అందుకు దీటుగా జనసేన కూడా ఫ్లెక్సీలు ముద్రిస్తుందని, ఆతర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాసా రవి ప్రకాష్, రాహుల్ సాగర్, కర్ణం రవి, బజారి, షబ్బీర్, ప్రసాద్, రాము, రషీద్, మల్లి, అక్బర్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.