అవును మేము విడిపోతున్నాం: నాగచైతన్య, సమంత

యువ కథానాయకుడు నాగచైతన్య, సమంతల వైవాహిక బంధానికి తెరపడింది. తాము విడాకులు తీసుకోనున్నట్లు నాగచైతన్య, సమంత సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

”మా శ్రేయోభిలాషులందరికీ.. ఇక నుంచి మేం భార్య-భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి వేర్వేరుగా మా సొంత మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్నాం. పదేళ్లుగా మా స్నేహం కొనసాగినందుకు మేం అదృష్టవంతులం. మా స్నేహం వివాహ బంధానికి చాలా కీలకంగా నిలిచింది. ఇప్పుడు ఈ కష్ట సమయంలో అభిమానుల మద్దతు కావాలి. మా గోప్యతను కాపాడాలని శ్రేయోభిలాషులు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం”

-సామాజిక మాధ్యమాల వేదికగా నాగచైతన్య, సమంత

చై-సామ్‌ల ప్రయాణం అలా మొదలైంది!

అక్కినేని కుటుంబం నుంచి నట వారసుడిగా ‘జోష్‌’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు నాగచైతన్య. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత తండ్రి బాటలోనే ఓ మంచి రొమాంటిక్‌ లవ్‌స్టోరీ చేయాలనుకున్నారు. ఆ క్రమంలో పట్టాలెక్కిన చిత్రం ‘ఏమాయ చేసావె’. ఈ సినిమా చైతూకు తొలి విజయాన్ని అందించడమే కాకుండా, వ్యక్తిగత జీవితాన్ని కూడా మలుపు తిప్పింది. ఇందులో కథానాయికగా తెలుగు, తమిళ తెరకు పరిచయమైంది సమంత. ఈ చిత్రంలో పనిచేసేటప్పుడే సమంత, నాగచైతన్యల మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది. ఒక పక్క తమ కెరీర్‌ను కొనసాగిస్తూనే ప్రేమలోకంలో విహరించారు.

ఇరు కుటుంబాలు సామ్‌-చైతూల పెళ్లికి ఓకే చెప్పడంతో జనవరి 29, 2017న వీరికి నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబరు 6న హిందూ వివాహ పద్ధతిలో, అక్టోబరు 7న క్రిస్టియన్‌ పద్ధతిలో వివాహ వేడుక నిర్వహించారు. గోవాలో జరిగిన ఈ వేడుకలో బంధువులు, కొంతమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. అప్పటి నుంచి ‘చై-సామ్‌’జోడీకి చిత్ర పరిశ్రమలోనే కాకుండా పబ్లిక్‌లోనూ మంచి క్రేజ్‌ వచ్చింది. వీరిద్దరూ కలిసి సినిమా చేసినా, ప్రకటనలో కనిపించినా అభిమానులు తెగ సంబర పడేవారు. ఇక ఒకరి సినిమాల గురించి మరొకరు ప్రశంసించుకునేవారు. ఇంట్లోనూ తమ వ్యక్తిగత జీవితాన్ని గురించి ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకునేవారు. కలిసి సినిమాలు చూడటం, వ్యాయామాలు, ఫుడ్‌ ఇలా ఇరువురూ కలిసి ఎన్నో విశేషాలను షేర్‌ చేసేవారు. అలాంటిది వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్లు అక్టోబరు 2, 2021న సామాజిక మాధ్యమాల వేదికగా చై-సామ్‌లు ప్రకటించారు.