మద్యంలో ఆంధ్రా మునకలు!

*మ‌ద్య నిషేధానికి జ‌గ‌న్ నీళ్లు
*చెప్పిందొక‌టి చేస్తోందొక‌టి
*అడుగడుగునా వంచ‌న విధానాలు
*ఆడ‌ప‌డుచుల‌కిచ్చిన వాగ్దానం వమ్ము

“మా నాయ‌కుడు మాట త‌ప్ప‌డు… మ‌డ‌మ తిప్ప‌డు” అని వైకాపా నాయ‌కులు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ గురించి త‌ర‌చు చెబుతుంటారు. నిజంగా అలా ఉండే ఏ రాజ‌కీయ నాయ‌కుడైనా క‌చ్చితంగా శ్లాఘ‌నీయుడే. ప్ర‌జ‌లు కూడా అలాగే విశ్వ‌సించారు. జ‌గ‌న్ ను చూసి వైకాపాను భారీ మెజార్టీతో గెలిపించారు. కానీ… వాస్త‌వానికి జ‌రుగుతున్న‌దేమిటి? “మాట మీద నిల‌బ‌డ‌డు… మ‌డ‌త పేచీలు పెడ‌తాడు…” అని ఆ జ‌న‌మే అనుకుంటున్నారిప్పుడు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌ద్య విధాన‌మే అందుకు ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం!
అధికారం కోసం ఒక మాట‌… అధికారం అందాక మ‌రో మాట చెప్పే ఏ రాజ‌కీయ నాయ‌కుడైనా ప్ర‌జ‌ల‌ను వంచ‌న చేస్తున్న‌ట్టే లెక్క‌! అలాంటి న‌య‌వంచ‌క విధానాలకు ఉదాహ‌ర‌ణ‌లు కోకొల్ల‌లుగా ఉన్నా, ఒక్క మ‌ద్యం విధానాన్ని తీసుకుంటే చాలు… సీఎం మాట ఎలా మ‌డ‌త ప‌డుతోందో, వాగ్దానాలు ఎలా వ‌మ్ము అవుతున్నాయో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. అందుకు ఇవిగో ఉదాహ‌ర‌ణ‌లు…
* న‌య‌వంచ‌న నెంబ‌ర్ 1!
“కాపురాల్లో మ‌ద్యం చిచ్చు పెడుతోంది. మాన‌వ సంబంధాలు ధ్వంస‌మైపోతున్నాయి. మేం అధికారంలోకి వ‌చ్చాక మూడు ద‌శ‌ల్లో మ‌ద్యాన్ని నిషేధిస్తాం. కేవలం ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌కే మ‌ద్యాన్ని ప‌రిమితం చేస్తాం…” ఇవి 2019 ఎన్నిక‌లకు ముందు వైకాపా అధినేత జ‌గ‌న్ ఊరూరా పాద‌యాత్ర చేస్తూ ప‌దే ప‌దే చెప్పిన మాట‌లు. మ‌రిప్పుడు ఏం జ‌రుగుతోంది? ఉన్న మ‌ద్యం షాపులకు అద‌నంగా కొత్తగా మ‌రో మూడు వంద‌ల షాపుల‌కు లైసెన్స్‌లు జారీ చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.
అంతేకాదు… తాజాగా బార్ల‌ను నెల‌కొల్పడానికి గ‌తంలో ఉండే స‌రిహ‌ద్దు ఆంక్ష‌ల‌ను కూడా స‌డ‌లించారు. అంటే… ఇప్పుడు న‌గ‌రాల ప‌రిధి చుట్టూ 10 కిలోమీట‌ర్ల వ‌ర‌కు, ప‌ట్ట‌ణాల ప‌రిధికి 3 కిలోమీట‌ర్ల వ‌ర‌కు బార్లు పెట్టుకోవ‌చ్చు. యధేచ్చ‌గా మ‌ద్యం అమ్ముకోవ‌చ్చు.
మ‌రి… ఇది న‌య‌వంచ‌న కాదా?
* న‌య‌వంచ‌న నెంబ‌ర్ 2!
ఒక వ్య‌క్తి నోటితో ఓ మాట చెప్పి, చేతిరాత‌లో అందుకు భిన్నంగా రాస్తే ఆ వ్య‌క్తిని ఏమంటారు? క‌పటి అంటారు. కానీ ప్ర‌భుత్వ‌మే అలా చేస్తే ఏమ‌నాలి? జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌ద్య విధానం ఇదే నిరూపించింది. ఎలాగో చూద్దాం…మ‌ద్య నిషేధం విధిస్తామ‌ని పాద‌యాత్ర‌లో చెప్పి, అధికారం అందాక ద‌శ‌ల వారీగా నిషేధిస్తామ‌ని జ‌గ‌న్ చెబుతూ వ‌స్తున్నారు. అనేక సాధ్యాసాధ్యాల ప‌రంగా చూసిన‌ప్పుడు ద‌శ‌ల వారీగా అయినా ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోవ‌డం త‌ప్పు కాదు. కానీ జ‌రిగిందేమిటో తెలుసా? రాష్ట్రంలో మ‌ద్యం వ్యాపార లావాదేవీలు చూసే బేవ‌రేజెస్ కార్పొరేష‌న్ ద్వారా బాండ్ల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టింది. కానీ ఓ ప‌క్క మ‌ద్య నిషేధం అని చెబుతుంటే ఆ బాండ్ల‌ను ఎవ‌రైనా ఎందుకు కొనుగోలు చేస్తారు? అందుక‌ని.. మ‌ద్య నిషేధం ఉండ‌బోద‌ని, మ‌ద్యం అమ్మ‌కాలు య‌ధావిధిగా జ‌ర‌గుతాయ‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం లిఖిత పూర్వ‌కంగా హామీ ఇచ్చి, ఆ బాండ్ల అమ్మ‌కాల ద్వారా తాజాగా ఏకంగా 8,300 కోట్ల రూపాయ‌లను ప్ర‌భుత్వం సేక‌రించింది.
మ‌రి ఈ ప్ర‌భుత్వాన్ని ఏమ‌నాలి?
* న‌య‌వంచ‌న నెంబ‌ర్ 3!
ప‌రిపాల‌న ప‌రిధిలోకి వ‌చ్చిన ఏ వ్య‌వ‌స్థ‌నైనా అంత‌కు ముందుక‌న్నా మెరుగు ప‌ర‌చ‌డం అవ‌స‌ర‌మే. కానీ ఆ పేరుతో హ‌డావుడి చేసి, అధికార ప‌ర‌మైన అహంకారాన్ని ప్ర‌ద‌ర్శించ‌డానికో… త‌మ‌కు అనుకూలురైన వారికి ప్ర‌యోజ‌నం క‌లిగించ‌డానికో ప్ర‌య‌త్నిస్తే అది కూడా వంచ‌న‌లో భాగ‌మ‌నే చెప్పుకోవాలి. ఇసుక విధానంలో కానీ, సినిమా టికెట్ల విధానంలో కానీ జ‌రిగిందిదే. అదే వ్య‌వ‌హార శైలి మ‌ద్యం విష‌యంలో కూడా పున‌రావృత‌మైంది. ఎలాగో చూద్దాం… జ‌గ‌న్ అధికారం స్వీక‌రించ‌డానికి ముందు రాష్ట్రంలో మొత్తం 4380 మద్యం షాపులు ఉన్నాయి. జ‌గ‌న్ అధికారంలోకి రాగానే ద‌శ‌ల వారీ మ‌ద్య నిషేధంలో భాగంగా మొద‌టిగా 2019లో 880 షాపుల లైసెన్స్‌లు ర‌ద్దు చేశారు. దాంతో షాపుల సంఖ్య 3500కి త‌గ్గింది. ఆ త‌ర్వాత మ‌రో సారి ఆ సంఖ్య‌ను 2934కి త‌గ్గించారు. అలాగే బార్ల సంఖ్య‌ను కూడా త‌గ్గించారు. అయితే ఇందులో న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌ను ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. బార్ల‌య‌జ‌మానులు కోర్టుకు ఎక్కే అవ‌కాశాన్ని విస్మ‌రించింది. నిజంగా మ‌ద్య నిషేధం మీద చిత్త‌శుద్ధి ఉంటే… అన్ని ర‌కాల అడ్డంకుల‌ను ముందుగానే అంచ‌నా వేసి అందుకు త‌గిన విధంగా చ‌ర్య‌లు తీసుకోవాలి. అలా జ‌ర‌గ‌క పోవ‌డంతో త‌మ‌కు 2022 జూన్ వ‌ర‌కు బార్ల‌ను కొన‌సాగించుకునే అధికారం త‌మ‌కు ఉందంటూ య‌జ‌మానులు కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పు కూడా వారికి అనుకూలంగా రావ‌డంతో అవి కొన‌సాగాయి.
ఇప్పుడు ఆ గ‌డువు పూర్త‌వడంతో తిరిగి వాటి విష‌యంలో నిర్ణ‌యం తీసుకోగ‌ల అవ‌కాశం వ‌చ్చింది. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆ విష‌యాన్ని పూర్తిగా ప‌క్క‌న పెట్ట‌డ‌మే కాదు, వాటిని య‌ధావిధిగా కొన‌సాగించుకునేలా చ‌ర్య‌లు తీసుకుంది.
అంటే దానర్థం ఏమిటి? మ‌ద్య‌నిషేధంపై ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి లేద‌ని!
ఎన్న‌డూ లేనంత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసి, ఇక ఎక్క‌డా అప్పులు సైతం పుట్ట‌ని దుస్థితికి దిగ‌జారి, జీత‌భ‌త్యాల చెల్లింపుల‌కు సైతం క‌ట‌క‌ట‌లాడుతున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్పుడు మ‌ద్యం అమ్మ‌కాల మీద‌నే ఆధార పడాల్సి రావ‌డ‌మే ఇందుకు అస‌లు కార‌ణ‌మ‌ని ఏమాత్రం అవ‌గాహ‌న ఉన్న సామాన్యుల‌కు సైతం అర్థ‌మ‌వుతోంది.
అంతేకాదు… ఈ నేప‌థ్యంలో మ‌ద్య నిషేధాన్ని అడ్డం పెట్టుకుని అంత‌వ‌ర‌కు కొన‌సాగుతున్న మద్యం వ్యాపారాల‌ను ర‌ద్దు చేసి, త‌మ అనుచ‌రుల‌కు షాపులు, బార్లు కేటాయించ‌డ‌మే అస‌లు కార‌ణ‌మ‌నే ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. వాటికి స‌హ‌జంగానే ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర స‌మాధానం లేదు.
* న‌య‌వంచ‌న నెంబ‌ర్ 4!
“మ‌ద్యంపై ఆదాయాన్ని ఒకేసారి పూర్తిగా తీసేయ‌లేం. దానిపై వ‌చ్చే ఆదాయాన్ని క్ర‌మంగా త‌గ్గించుకుంటూ వెళ్తాం. 2024 ఎన్నిక‌ల నాటికి కేవలం 5 నక్ష‌త్రాల హోట‌ళ్ల‌లోనే మ‌ద్యం దొరికేలా చేస్తాం. అప్పుడే తిరిగి ఓట్లు అడుగుతాం” ఇది ‘మాట త‌ప్ప‌ని’ జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల్లో గెలిచిన వెంట‌నే జ‌రిగిన తొలి విలేక‌రుల స‌మావేశంలో మార్చిన మాట‌.
కానీ… ఇప్పుడు తాజాగా జ‌రిగిందేమిటి? 2024 కాదు క‌దా… 2025 ఆగ‌స్టు వ‌ర‌కు కూడా మ‌ద్య నిషేధం అనేది ఉండ‌నే ఉండ‌ద‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేత‌ల్లో ప్రత్య‌క్షంగా చూపించింది! అదెలాగో చూద్దాం…తాజాగా ఈ ఏడాది సెప్టెంబ‌రు 1 నుంచి 2025 ఆగ‌స్టు 31 వ‌ర‌కు మూడేళ్ల కాల‌ప‌రిమితితో కొత్త బార్ల విధానాన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొత్త‌గా ప్ర‌క‌టించింది.
ఆ ప్ర‌కారం చూస్తే… ప్ర‌స్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉండ‌గా, వాటిలో ఒక్క‌టి కూడా త‌గ్గించబోమ‌ని మూడేళ్ల వ‌ర‌కు అవే కొన‌సాగుతాయ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసిందన్న‌మాట‌.
దాన‌ర్థం ఏమిటి? 2024 క‌ల్లా కేవ‌లం స్టార్ హోట‌ళ్ల‌కే మ‌ద్యాన్ని ప‌రిమితం చేస్తామ‌న్న మాట కూడా గాలికి ఎగిరిపోయిన‌ట్టే!
* న‌య‌వంచ‌న నెంబ‌ర్ 5!
హామీలిచ్చి, వాటికి తిలోద‌కాలివ్వ‌డం ఒక ర‌క‌మైన వంచ‌నైతే… ఆ హామీల‌కు అనుగుణంగానే ముందుకు సాగుతున్నామ‌నే భ్ర‌మ క‌లిగిస్తూ, లోపాయికారీగా అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌డం మ‌రో ర‌కం న‌య‌వంచ‌న‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌ద్యం విషయంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వ విధానాన్ని నిశితంగా ప‌రిశీలిస్తే ఇదే అర్థం అవుతుంది. ఇదెలాగో చూద్దాం…
ద‌శ‌ల వారీ మ‌ద్య నిషేధంలో భాగంగా మ‌ద్యం దుకాణాల సంఖ్య‌ను 4380 నుంచి 2019లో 3500కి, ఆ త‌ర్వాత 2020లో 2934కి త‌గ్గించ‌డాన్ని వైకాపా నేత‌లు త‌ర‌చు చెప్పుకుంటున్నారు. కానీ లోపాయికారీగా జ‌రుగుతున్న‌దేంటో తెలుసా?
కొన్ని మ‌ద్యం షాపుల‌ను త‌గ్గించిన ప్ర‌భుత్వం వాటి స్థానంలో వాకిన్ స్టోర్ల‌ను తీసుకొచ్చింది. సాధార‌ణ దుకాణాల్లో రోజుకు రూ. 2.5 ల‌క్ష‌ల విలువైన మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రుగుతుంటే… ఈ వాకిన్ దుకాణాల ద్వారా రోజుకు స‌గ‌టున రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయి. అంటే ద‌శ‌ల వారీ మ‌ద్య నిషేధం చేస్తున్నామంటూ ప్ర‌జ‌ల‌కు భ్ర‌మ క‌లిగిస్తూనే… లోపాయికారీగా మ‌ద్యం అమ్మ‌కాల‌కు లోటు రానీయ‌కుండా చూసుకుంటోంద‌న్న‌మాట‌. అదేకాకుండా… 2020 త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మ‌ద్యం దుకాణాన్ని కూడా త‌గ్గించ‌లేదు. ఈ విష‌యాల‌ను బ‌ట్టి చూస్తే… జ‌గ‌న్ హామీలు ఎలా ద‌శ‌ల వారీగా వ‌మ్ము అవుతున్నాయో ఇట్టే అవ‌గ‌త‌మ‌వుతుంది.
* న‌య‌వంచ‌న నెంబ‌ర్ 6!
మ‌ద్య నిషేధానికి ప్ర‌భుత్వం ఎలా తూట్లు పొడుస్తోందో చెప్ప‌డానికి విశ్లేష‌ణ‌లు అక్క‌ర్లేదు. కేవ‌లం అంకెలే చాలు. అవి మ‌ద్యం విక్ర‌యాల‌కు సంబంధించిన అంకెలు. వాటికేసి ఓసారి దృష్టి సారిద్దాం… మ‌ద్య నిషేధానికి సంబంధించి ప్ర‌భుత్వం ఏమాత్రం చ‌ర్య‌లు తీసుకున్నా… మ‌ద్యం విక్ర‌యాలు త‌గ్గుతాయి కానీ పెర‌గ‌వు. అంటే ప్ర‌భుత్వం మ‌ద్య నిషేధం దిశగా చేసే ప్ర‌య‌త్నాల‌కు మ‌ద్యం విక్ర‌యాలే గీటురాళ్లు. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్టిన మూడేళ్ల‌లో మ‌ద్యం విక్ర‌యాలు ఏకంగా రూ.65 వేల కోట్లకు పైగా చేరాయి. క‌చ్చితంగా చెప్పాలంటే 2019-20లో రూ.20,938.61 కోట్లు, 2020-21లో 20,189 కోట్లు, 2021-22లో కేవ‌లం మార్చి వ‌ర‌కే 24,714 కోట్ల మేర‌కు మ‌ద్యం విక్ర‌యాలు జ‌రిగాయి. ఇక రాబోయే ఆర్థిక సంవ‌త్స‌రమైన 2022-23లో మ‌ద్యం పై విధించే స్టేట్ ఎక్సైజ్ ప‌న్ను ద్వారా రూ. 16,500 కోట్ల ఆదాయం వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వం బ‌డ్డెట్‌లోనే చూపించింది. ఇంత ఎక్సైజ్ ప‌న్ను రావాలంటే మ‌ద్యం అమ్మ‌కాలు ఏమేర‌కు జ‌ర‌గాలో తెలుసా? క‌నీసం రూ. 30 వేల కోట్లు! ఇవి అంకెలు చెప్పే ప‌చ్చి నిజాలు!
* న‌య‌వంచ‌న నెంబ‌ర్ 7!
ఓ ప‌క్క మ‌ద్యం విక్ర‌యాలు పెర‌గాలి…మ‌రో ప‌క్క ఆ ఆదాయాన్ని చూపిస్తూ అప్పులు పుట్టించాలి…అలా అప్పులు పుట్టించ‌డం కోసం రాజ్యాంగాన్ని, బ్యాంకుల‌ను, ఆఖ‌రికి చ‌ట్టాన్ని కూడా బురిడీ కొట్టించే విధానాలు పాటించాలి…ఇదీ… జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేప‌డుతున్న న‌యా న‌య‌వంచక విధానాల సారాంశం. ఇదంతా ఎలా జ‌రుగుతోందో చూద్దాం…తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాబోయే కాలంలో వ‌సూల‌య్యే మ‌ద్యం ఆదాయాన్ని చూపించి ఇప్ప‌టికే వేల కోట్ల రూపాయ‌ల అప్పులు చేసింది. అప్పులు చేయ‌డం కోసం మ‌ద్యం ఆదాయాన్ని హామీగా చూపించిందంటే దాన‌ర్థం… మ‌ద్య నిషేధం ఉండ‌ద‌న్న‌మాటేగా! ఇది అంద‌రికీ అర్థ‌మ‌య్యే విష‌య‌మే కానీ… అలా అప్పులు పుట్టించ‌డం కోసం ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాలు ఆర్థిక నిపుణుల‌ను సైతం విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించే స్టేట్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఎస్‌డీసీ), మ‌ద్యం విక్ర‌యాల వ్య‌వ‌హారాల‌ను చూసే స్టేట్ బేవ‌రేజెస్ కార్పొరేష‌న్ ఉన్నాయి. వాటి ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌ల నుంచి అప్పులు తెచ్చుకునే అవ‌కాశం ప్ర‌భుత్వానికి ఉంది. ఇప్ప‌టికే ఎస్‌డీసీ ద్వారా వేల కోట్ల రూపాయ‌ల రుణాన్ని ప్ర‌భుత్వం పొందింది. ఇందుకోసం మ‌ద్యంపై అద‌న‌పు ప‌న్ను విధించింది. పాతికేళ్ల పాటు వ‌చ్చే ఆదాయాన్ని తాక‌ట్టు పెట్టింది. అయితే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్ర‌భుత్వానికి ఇది ఏమూలకూ స‌రిపోదు. అందుక‌ని బేవ‌రేజెస్ కార్పొరేష‌న్ ద్వారా రుణాలు చేయాల్సి వ‌చ్చింది. అయితే ఇక్క‌డొక చిక్కుంది. మ‌ద్యం ద్వారా జ‌రిగే అమ్మ‌కాలు, వాటిపై ప‌న్నుల సొమ్మంతా నేరుగా రాష్ట్ర ఖ‌జానాకు జ‌మ అవుతుంది. బేవ‌రేజెస్ కు కేవ‌లం నిర్వ‌హ‌ణ ఛార్జీల‌ను మాత్ర‌మే ప్ర‌భుత్వం చెల్లిస్తూ ఉంటుంది. బేవ‌రేజెస్ ద్వారా రుణాలు పొందాలంటే అందుకు హామీగా దానికి మ‌రింత ఆదాయం ల‌భించే అవ‌కాశాల‌ను చూపించాల్సి ఉంటుంది. ఇందుకు ప్ర‌భుత్వం ఒక యోచ‌న చేసింది. మ‌ద్యం అమ్మకాల‌పై ఎక్సైజు ప‌న్ను విధించి అందులో కొంత భాగం బేవ‌రేజెస్‌కు జ‌మ అయ్యేలా చేయాల‌నేదే ఆ ఆలోచ‌న‌. అయితే రాజ్యాంగం ప్ర‌కారం ట్యాక్స్‌, డ్యూటీ, సెస్‌, ఫీజు లాంటి పేర్ల ద్వారా ప్ర‌జ‌ల నుంచి వసూలు చేసే ప‌న్నుల ఆదాయం ఏదైనా అది ఖ‌జానాకు మాత్ర‌మే జ‌మ అవ్వాలి. దాంతో ప్ర‌భుత్వం స్పెష‌ల్ మార్జిన్ పేరును ఉటంకిస్తూ, ఆ పేరుతో వ‌సూల‌య్యే సొమ్ములో కొంత భాగం నేరుగా బేవ‌రేజెస్ కార్పొరేష‌న్‌కు జ‌మ అయ్యేలా కొత్త జీవోలు (312, 313) జారీ చేసింది. వీటి ప్ర‌కారం మ‌ద్యంపై విధించే ప‌న్ను ఆదాయాన్ని రెండు భాగాలు చేశారు. వీటి ప్ర‌కారం వీటిలో చిన్న భాగం ఖ‌జానాకు, పెద్ద భాగం బేవ‌రేజెస్‌కు జ‌మ అయ్యేలా చేశారు. చిన్న భాగాన్ని వ్యాట్ (విలువ ఆధారిత ప‌న్ను) అనీ, పెద్ద భాగాన్ని స్పెష‌ల్ మార్జిన్ అనీ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల బేవ‌రేజెస్‌కు వేల కోట్ల ఆదాయం జ‌మ అవుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు 2020-21లో మ‌ద్యంపై సుమారు రూ. 12,000 కోట్ల ఆదాయం వ‌చ్చింది. ఇందులో రూ. 3000 కోట్లు నేరుగా ఎస్‌డీసీకి చేరుతుంది. అక్క‌డి నుంచి అప్పుల అస‌లు, వ‌డ్డీల రూపంలో బ్యాంకుల‌కు వెళ్లిపోతుంది. మిగిలిన రూ.9000 కోట్ల‌లో మూడు వేల కోట్లు మాత్రం ఖ‌జానాకు వెళుతుంది. మిగిలిన రూ. 6000 కోట్లు బేవ‌రేజెస్‌కు చేరుతుంది. ఈ ఆదాయాన్ని హామీగా చూపించి ల‌క్ష‌ల కోట్లలో అప్పు తెచ్చుకునే అవ‌కాశం ప్ర‌భుత్వానికి వ‌చ్చింది. నిజానికి భ‌విష్య‌త్తులో రాబోయే ఆదాయాన్ని చూపించి అప్పులు చేసే విధానంపై హైకోర్టులో కేసు న‌డుస్తోంది. ఇలా ఎలా చేస్తార‌ని హైకోర్టు ప్ర‌శ్నించింది కూడా. ఆ కేసు కోర్టులో ఉండ‌గానే జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం త‌నదైన శైలిలో కొత్త రుణాల కోసం ఇలాంటి గిమ్మిక్కులు చేస్తూనే ఉంది. ఇది ఒక విధంగా రాజ్యాంగాన్ని, బ్యాంకుల‌ను, చ‌ట్టాన్ని సైతం ప‌రోక్షంగా మోసం చేయ‌డ‌మేన‌నే విమ‌ర్శ‌లు ఆర్థిక నిపుణుల నుంచి, ప‌రిశీల‌కుల నుంచి వినిపిస్తున్నాయి.
* న‌య‌వంచ‌న నెంబ‌ర్ 8!
మ‌ద్య నిషేధంపై ద‌శ‌ల వారీ విధాన‌మంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెడుతున్న ప్ర‌భుత్వం ఇప్పుడు కొత్త‌గా మ‌రో పేరుతో మ‌ద్యం షాపుల‌కు, బార్ల‌కు అనుమ‌తులు మంజూరు చేయ‌డం అందరినీ ఆశ్చ‌ర్య‌పరుస్తోంది. ఎలాగంటే…ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు వ‌చ్చే వారి కోసం అనే సాకు చూపిస్తూ కొత్తగా మ‌రో 300 మ‌ద్యం దుకాణాల‌కు, 21 బార్ల‌కు అనుమ‌తులు జారీ చేస్తోంది. ఇప్ప‌టికే రాష్ట్రంలో వాకిన్ స్టోర్ల పేరుతో 90 మ‌ద్య దుకాణాల‌కు అనుమ‌తులు ఇవ్వ‌గా వాటిలో 24 ఏర్పాటు చేశారు. అవి కూడా క‌లిపి ఇప్పుడు కొత్త‌గా 300 షాపులు పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ప‌ర్యాట‌క ప్రాంతాల గుర్తింపు, ఇత‌ర ఏర్పాట్ల‌లో ఎక్సైజ్ అధికారులు నిమ‌గ్న‌మైపోయారు. దీంతో మ‌ద్య నిషేధానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం పూర్తిగా మంగ‌ళం పాడిన‌ట్ట‌యింది. వీటి ద్వారా ఎలా లేద‌న్నా మ‌రో 200 కోట్ల రూపాయ‌ల మేర‌కు మ‌ద్యం విక్ర‌యాలు పెరుగుతాయ‌ని అంచ‌నా. ఇన్ని న‌య‌వంచ‌క విధానాల‌తో ముందుకు సాగుతున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను మ‌ద్యంలో ముంచుతోంది! ప్ర‌జ‌ల‌ను భ్ర‌మల్లో తేలుస్తోంది!!