ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రోజెనెకా వ్యాక్సిన్‌ సురక్షితం: డబ్ల్యూహెచ్‌వో

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నుంచే ఇప్పుడిప్పుడే విముక్తి కలుగుతుంది. ఇందుకు వివిధ ఔషధ కంపెనీలు తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని కంపెనీల టీకాలపై కలుగుతున్న అనుమానాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆక్స్‌ఫర్డ్ సౌజన్యంతో ఆస్ట్రోజెనెకా సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్ వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతినిచ్చింది. దక్షిణాఫ్రికాలో ఈ వ్యాక్సిన్ వినియోగంపై అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో ఈ వ్యాక్సిన్‌కు గ్రీనిసిగ్నల్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్యానెల్ సభ్యులు… ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ సురక్షితమని, ప్రభావశీలి అని, దీనిని పూర్తి స్థాయిలో వినియోగించవచ్చని తెలిపింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఆన్ ఇమ్యునైజేషన్(సెజ్) తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా నుంచి విముక్తి కలగాలంటే రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి అని సూచించింది. అదీకూడా 8 నుంచి 12 వారాల తేడాతో దీనిని తీసుకోవాలని తెలిపింది. పైగా ఈ వ్యాక్సిన్ 65 సంవత్సరాలు, అంతకుమించిన వయసు వారికి కూడా సురక్షితమని పేర్కొంది. సెజ్ ప్రతినిధి అలెజాండ్రో క్రావియోటో మాట్లాడుతూ.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రభావంపై దక్షిణాఫ్రికా దేశంతో సహా పలు దేశాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.. అయితే, ఈ దేశాలలో ఈ వ్యాక్సిన్ వినియోగాన్ని నిలిపివేయడం తగదన్నారు. కొన్నిచోట్ల కరోనా కొత్త వేరియంట్ కనిపించిందని, ఫలితంగా వ్యాక్సిన్ ప్రభావం తక్కువగా ఉన్నదని తెలిపారు. ఇంతకుమించి ఆయా దేశాలలో కరోనా టీకా వినియోగం నిలిపివేయడానికి ప్రత్యేక కారణాలేవీ కనిపించడం లేదన్నారు. నిరభ్యంతరంగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగించుకోవచ్చని ఆయన సూచించారు.