తైవాన్ లో ఘోర రైలు ప్రమాదం.. టోరోకో జార్జ్‌ ప్రాంతంలో దుర్ఘటన

తైవాన్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అధికారులు వెల్లడించిన వివరాల మేరకు… 350 మందితో ప్రయాణిస్తున్న రైలు శుక్రవారం ఉదయం పట్టాలు తప్పడంతో సొరంగ మార్గాన్ని ఢకొీంది. ఈ ఘటనలో 48 మంది మృతి చెందారు. 72 మంది గాయపడ్డారని రవాణా మంత్రిత్వశాఖ ప్రకటించింది. రైల్లోని ప్రయాణీకులంతా పెద్ద ఎత్తున రోదనలు చేశారు. ప్రమాదం నుంచి తమను రక్షించాలంటూ కేకలు వేశారు. ఘటనా స్థలానికి రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్య్కూ టీమ్‌ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రైలు బోగీలు తీవ్రంగా దెబ్బతినడంతో, కొందరు రైలులోనే చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సివస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

ఈ సందర్భంగా రవాణా మంత్రిత్వశాఖ అధికారులు మాట్లాడుతూ.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. రైలు బోగీలు తీవ్రంగా దెబ్బతినడంతో బోగీల్లో చిక్కుకున్న ప్రయాణీకులను బయటకు తీయడం అధికారులకు కష్టంగా మారిందని అన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోందని, వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అక్కడి మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టిందని వివరించారు.

మృతుల కుటుంబాలకు అధ్యక్షుడు త్సాయి ఇంగ్ వెన్ సంతాపం తెలిపారు. ఘటన పట్ల విచారణకు ఆదేశించారు. తైవాన్‌లో ప్రస్తుతం టాంబ్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అక్కడ రైలు ట్రాఫిక్ భారీ స్థాయిలో ఉంటుంది. పట్టాలు తప్పిన బోగీల నుంచి సుమారు వంద మంది ప్రయాణికులను రక్షించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దాకింగ్‌షుయి టన్నెల్ వద్ద రైలు ప్రమాదం జరిగింది.