కరోనా హాట్ స్పాట్ గా భోపాల్ ఎయిమ్స్… 53 మంది డాక్టర్లకు పాజిటివ్!

మధ్యప్రదేశ్ లోని ప్రతిష్ఠాత్మక వైద్యశాలగా పేరున్న ఎయిమ్స్ ఇప్పుడు కరోనా మహమ్మారికి నిలయంగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా, తాజాగా ఎయిమ్స్ లోని 53 మంది డాక్టర్లు, విద్యార్థులు మహమ్మారి బారిన పడటం తీవ్ర కలకలం రేపింది.

వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు కూడా వైరస్ బారిన పడిన వారి జాబితాలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. భోపాల్ ఎయిమ్స్ కు నిత్యమూ వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. గత కొంతకాలంగా కరోనా సోకిన వైద్యులు, హెల్త్ కేర్ వర్కర్లు ఎవరిని కాంటాక్ట్ చేశారన్న విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదిలావుండగా, ఇటీవల ఎయిమ్స్ లో వంద మందికి పైగా వైద్యులు కరోనా బారిన పడ్డారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు రాగా, వాటిని ఉన్నతాధికారులు ఖండించారు.