కరోనా నిబందనలు పాటిస్తూ వర్షాకాల సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు

దేశవ్యాప్తంగా కరోనావైరస్‌ వ్యాప్తి అతి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో కరోనా నిబందనలు పాటిస్తూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో జూలై 17న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు చర్చించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కల్లా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సభ్యుల మధ్య భౌతిక దూరం ఉండేలా.. లోక్‌సభ, రాజ్యసభలో చాంబర్లు, గ్యాలరీలను కూడా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఆగస్టు మూడో వారం నాటికి ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు.

ఈ మేరకు రాజ్యసభ ఎంపీలకు లోక్‌సభలో సీటింగ్‌ ఏర్పాటు చేశారు. అలాగే రేడియేషన్ పద్ధతి ద్వారా ఆల్ట్రా వైలెట్ కిరణాలను ప్రసరింపచేసి వైరస్‌ను తుదముట్టించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా.. పార్లమెంట్‌లోని 4 గ్యాలరీలల్లో మరో ఆరు చిన్న తెరలను ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్యసభ కార్యదర్శి పేర్కొన్నారు. సభలో ఆడియో సిస్టంతోపాటు.. చాంబర్లు, గ్యాలరీలను వేరు చేసేందుకు పాలికార్బోనేట్ షీట్‌లు వినియోగిస్తున్నట్లు కార్యదర్శి తెలిపారు. కాగా.. ఇలాంటి ఏర్పాట్లు పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారని రాజ్యసభ కార్యదర్శి వివరించారు. అయితే ఇప్పటివరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.