టిఎంసిలో చేరిన లియాండర్ పేస్

టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, అలనాటి నటి నఫీసా అలి శుక్రవారం నాడిక్కడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విలేకరుల సమావేశంలో లియాండర్ పేస్‌ను టిఎంసిలోకి ఆహ్వానిస్తూ తాను కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ఉన్న కాలంలో 14 ఏళ్ల పేస్ తనకు పరిచయమని మమత తెలిపారు. టిఎంసిలోకి తన చిన్న తమ్ముడిని ఆహ్వానిస్తున్నానని ఆమె చెప్పారు. తాను టెన్నిస్ నుంచి రిటైరైన తర్వాత దేశానికి ఏదైనా సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నానని పేస్ తెలిపారు. 1996 ఒలింపిక్స్ గేమ్స్‌లో రజత పతకాన్ని సాధించిన పేస్ ప్రపంచంలో డబుల్స్ ప్లేయర్స్‌లో మేటిగా పేరుగడించారు. ఇక నఫీసా అలీ విషయానికి వస్తే 1976లో ఫెమీనా మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న ఆమె మిస్ ఇంటర్నేషనల్ పోటీలో సెకండ్ రన్నర్ అప్‌గా నిలిచారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో దక్షిణ కోలకతాలో మమతా బెనర్జీపై ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టిఎంసి ఎంపి డెరెక్ ఓబ్రియన్ సమక్షంలో గోవాకు చెందిన పారిశ్రామికవేత్త మృణాళిని దేశ్‌ప్రభు కూడా టిఎంసిలో చేరారు.