పునః ప్రారంభం కానున్న బెంగళూరులో మెట్రోసేవలు

మెట్రో రైళ్ల సేవలను బెంగళూరులో త్వరలోనే పునః ప్రారంభిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్‌ యడియూరప్ప స్పష్టంచేశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్నప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు పలు చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. దీనిలో భాగంగా త్వరలోనే మెట్రో సేవలను పునరుద్ధరిస్తామని.. వీటికి అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు. నగరంలో ఓ ఫ్లైఓవర్‌కు పేరును ఖరారు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి యడియూరప్ప విలేకరులతో మాట్లాడారు. కరోనా కారణంగా గత ఐదు నెలలుగా నిలిచిపోయిన మెట్రో సేవలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. సెప్టెంబర్‌ 1 నుంచి మొదలయ్యే అన్‌లాక్‌ 4.0లో కేంద్రప్రభుత్వం సూచించే మార్గదర్శకాల కోసం వేచిచూస్తున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ప్రామాణిక నియంత్రణ పద్ధతులను సిద్ధం చేశామని మెట్రో అధికారులు పేర్కొన్నారు.