మార్కెట్లోకి విడుదలైన ‘స్పుత్నిక్ వి’

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తుండగా..ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలన్నీ కరోనా నివారణకు రష్యా తయారు చేసిన ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేసినట్లు రష్యా శుభవార్త చెప్పింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తామని ఈ మేరకు రష్యా ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను రష్యాకు చెందిన గమాలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంయుక్తంగా తయారుచేశాయి. క్లినికల్ ట్రయల్స్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన తరువాత స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లు రష్యన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

కోవిడ్-19 నివారణకు స్పుత్నిక్ వి ప్రపంచంలో తొలి వ్యాక్సిన్‌ను సిద్ధం చేసినట్లు గత నెల ఆగస్టు 11న రాష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఆ తరువాత ఈ వ్యాక్సిన్ కోసం చాలా దేశాలు ఆర్డర్ సైతం ఇచ్చినట్లు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలో త్వరలోనే ఈ రష్యన్ వ్యాక్సిన్ యొక్క మొదటి బ్యాచ్ వివిధ దేశాలకు కూడా పంపిణీ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా ఈ వారంలోనే ప్రజలకు వ్యాక్సిన్ వేయనున్నట్లు ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇదిలాఉంటే.. భారత్‌లో కూడా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ క్లినకల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు రష్యన్ డైరక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అధిపతి కిరిల్ దిమిత్రేవ్ వెల్లడించారు.