భారత్​తో సత్సంబంధాలే కోరుకుంటున్నాం: తాలిబన్లు

తాము అన్ని దేశాలతోనూ సఖ్యతనే కోరుకుంటున్నామని తాలిబన్ విదేశాంగశాఖ మంత్రి ఆమిర్‌ఖాన్ ముత్తాఖీ పేర్కొన్నారు. తొలిసారి ‘బీబీసీ’ ఉర్దూ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తాము ఏ దేశంతోనూ విరోధాన్ని కోరుకోవడం లేదని, భారత్ సహా అన్ని దేశాలతోనూ స్నేహాన్నే కోరుకుంటున్నట్టు చెప్పారు.

ఈ ఇంటర్వ్యూలో పలు విషయాలపై స్పందించిన ఆయన.. మహిళలపై కఠినంగా వ్యవహరిస్తున్నారని, అన్ని రంగాల నుంచి వారిని దూరం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. ఆరోగ్య వ్యవస్థలో నూటికి నూరుశాతం మహిళల భాగస్వామ్యం ఉందన్నారు. విద్యారంగం సహా అవసరమైన అన్ని రంగాల్లోనూ వారు సేవలు అందిస్తున్నారని తెలిపారు.

భారత్‌తో సంబంధాలపై మంత్రి ఆమిర్‌ఖాన్ మాట్లాడుతూ.. మాస్కో సదస్సులో భారత్, పాకిస్థాన్ సహా అనేక దేశాల ప్రతినిధులతో భేటీ అయినట్టు చెప్పారు. ఏ దేశాన్ని కూడా తాము వ్యతిరేకించలేదన్నారు. అలాగే, పాకిస్థాన్ ప్రభుత్వం- నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఎ-తాలిబన్ మధ్య తాము మధ్యవర్తిత్వం వహించడం నిజమేనన్నారు.

 అయితే, ఇప్పటి వరకు ఈ చర్చల్లో ఎలాంటి ఒప్పందమూ జరగలేదన్నారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇతర దేశాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదని హామీ ఇస్తున్నట్టు ముత్తాఖీ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభ నివారణకు భారత్ చూపిన చొరవను ప్రశంసిస్తున్నట్టు చెప్పారు.