ఆసియా సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో అంబానీ

న్యూఢిల్లీ: ఆసియా సంపన్నుల జాబితాలో ముఖేష్‌ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. 8000 కోట్ల డాలర్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచినట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ తెలిపింది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగుతున్న చైనావ్యాపార వేత్త, నాంగ్‌ఫూ స్రింగ్‌ సంస్థ అధిపతి జోంగ్‌ షాన్‌షాన్‌ను దాటుకుని మొదటిస్థానంలో నిలిచారు. ఈ జాబితాలో గత రెండేళ్లలో ఎక్కువకాలం పాటు ముఖేష్‌ కొనసాగారు. గతంలో అగ్ర స్థానంలో కొనసాగిన అలీబాబా గ్రూప్‌ అధిపతి జాక్‌మా నుండి ప్రథమ స్థానాన్ని ముఖేష్‌ దక్కించుకున్నారు. కాగా, జోంగ్‌ షాన్‌షాన్‌ కంపెనీ వ్యాక్సిన్‌ తయారీ సంస్థ బీజింగ్‌ వాంటారు బయోలాజికల్‌ ఫార్మసీ ఎంటర్‌ప్రైజ్‌ షేరు 3,757 శాతం పెరగడంతో ఆయన సంపద విలువ ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఫలితంగా అగ్రస్థానం లభించింది. ఈ వారంలో జోంగ్‌ కంపెనీ షేరు విలువ 20 శాతం కోల్పోవడంతో, సంపద మొత్తం కూడా గరిష్ఠాల నుంచి 2,200 కోట్ల డాలర్లు తగ్గింది. దీంతో ఆయన సంపద 7,660 కోట్ల డాలర్లకు చేరడంతో రెండో స్థానానికి చేరుకున్నారు. కాగా, ఇంధనం, టెక్‌, ఇ-కామర్స్‌లలో పెట్టుబడులు పెట్టడంతో పాటు గతేడాది గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలకు తమ రిటైల్‌ వెంచర్స్‌లో 2,700 కోట్ల డాలర్ల విలువైన వాటాలు విక్రయించడంతో ముఖేష్‌ సంపద 1,800 డాలర్ల మేర పెరిగి, 8,000 కోట్ల డాలర్లకు చేరింది.