హత్రాస్ ఘటన అత్యంత భయంకరం

హత్రాస్‌ ఘటన అత్యంత భయంకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాలంటూ ప్రశ్నించింది. ఈ కేసులోని సాక్షులను రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించి ఈ నెల 8లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధితురాలి కుటుంబం న్యాయవాదిని ఏర్పాటు చేసుకుందో కూడా స్పష్టం చేయాలని పేర్కొంది. గత నెల 14న హత్రాస్ ఘటనపై రాజకీయ దురుద్దేశంతో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ యూపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది.

దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బోపన్న, వి. రామ సుబ్రహ్మణియన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగాఈ కేసులో జ్యూడిషియల్ విచారణ చేపట్టాలనీ, దర్యాప్తును యూపీ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని కూడా పిటిషనర్లు సుప్రీంకోర్టును అభ్యర్థించారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అలహాబాద్ హైకోర్టులో విచారణ జరుతున్నందున… మరింత విస్తృతంగా విచారించేందుకు ఏమి చేయాలంటూ సలహా ఇవ్వాలని కూడా సుప్రీం అన్ని పక్షాలను కోరింది.