ఇంటర్ విద్యార్థులకు శుభవార్త అందిoచిన ఏపి ఇంటర్మీడియెట్ బోర్డు‌

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల కారణంగా ఈ సంవత్సరం కాలేజీల్లో క్లాసులు నిర్వహించే పరిస్థితి లేకపోవడం, తరగతుల నిర్వహణ ఆలస్యం కానుండడంతోనే సిలబస్‌ను 30శాతం మేర తగ్గించింది. ఈ మేరకు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి కుదించిన సిలబస్ సమాచారాన్ని బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

సైన్స్‌, ఆర్ట్స్ సబ్జెక్ట్‌లకు సంబంధించిన బోధనాంశాలు మరియు కుదించిన అంశాల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇక లాంగ్వేజ్‌లకు సంబంధించి కూడా ఒకటి, రెండు రోజుల్లో వివరాలను అప్‌లోడ్‌ చేయనున్నారు. ఇప్పటికే కరోనా నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరానికి గానూ సెంట్రల్‌ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 30శాతం సిలబస్‌ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

అదే బాటలోనే ఏపీ ఇంటర్మీడియెట్‌ బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది. కాలేజీల్లో పనిదినాల విషయానికొస్తే.. సాధారణంగా ఏడాదిలో 220 పని దినాలు రావాల్సి ఉండగా.. సెప్టెంబర్‌ 5 నుంచి కాలేజీలు ప్రారంభిస్తే 175 పని దినాలే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సెకండియర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభించారు. ఇక పదో తరగతి పూర్తి చేసి ఇంటర్‌ ఫస్టియర్‌లో చేరే వాళ్లకి బ్రిడ్జ్‌ కోర్సు పాఠాలు బోధించనున్నారు. ఈ మేరకు ఇంటర్‌ విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.