టీకా సర్టిఫికెట్‌పై మోడీ ఫొటో – కేంద్రానికి కేరళ హైకోర్టు నోటీసు

కోవిడ్‌ – 19 సర్టిఫికేట్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫొటోను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేరళ హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు పంపింది. ప్రస్తుత వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ పౌరుడి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని, ప్రధానమంత్రి ఫొటో లేకుండా సర్టిఫికేట్‌ కావాలని పిటీషనర్‌ కొట్టాయమ్‌ నివాసి ఎం. పీటర్‌ వాదించారు. అలాగే అమెరికా, ఇండోనేషియా, ఇజ్రాయెల్‌, జర్మనీతో సహా వివిధ దేశాల వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లను కూడా పిటీషనర్‌ సమర్పించారు. వివిధ దేశాల సర్టిఫికెట్లలో కేవలం అవసరమైన సమాచారం మాత్రమే ఉందని.. ఆయా దేశాల అధిపతుల ఫొటోలు లేవని పిటీషనర్‌ పేర్కొన్నారు. దీనిపై రెండు వారాల్లో తమ అభిప్రాయాలను దాఖలు చేయాలని జస్టిస్‌ పి.బి సురేష్‌ కుమార్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు.

పిటీషనర్‌ తరచూ అనేక ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. వెళ్లిన ప్రతిచోటా సర్టిఫికెట్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకే తనకు సర్టిఫికెట్‌పై ప్రధాని మోడీ ఫొటో లేకుండా ఇవ్వాలని పిటీషన్‌లో పేర్కొన్నాడు. ప్రభుత్వం దృఢంగా ఉంటే.. ఎలాంటి ఫొటో లేకుండా.. సర్టిఫికెట్‌ను ప్రజలకు ఇవ్వొచ్చునని పిటిషనర్‌ తెలిపారు. అయితే అడ్వకేట్‌ అజిత్‌జారు దాఖలు చేసిన పిటీషన్‌లో.. మహమ్మారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం.. ఓ వ్యక్తి ప్రదర్శనగా మీడియా ప్రచారం చేసింది. మోడీ ఫొటో లేకుండా వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ తీసుకువెళ్లే హక్కు తనకు ఉందని ఆయన పేర్కొన్నారు. ‘మహమ్మారికి వ్యతిరేకంగా.. ప్రత్యేకించి వ్యక్తిగతంగా ప్రధానమంత్రి కానీ.. కేంద్ర ప్రభుత్వం కానీ చేసిందా? ప్రజల తరుపున నిర్వహించాల్సిన బాధ్యత అది. అయితే… ప్రభుత్వం ఇస్తోన్న వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌పై మోడీ ఫొటో ఉంచడం అంటే… అది ప్రజల వ్యక్తిగత విషయాల్లోకి చొరబాటు’ అని పిటీషన్‌లో పేర్కొన్నారు.

గతంలో వ్యాక్సిన్‌ సర్టిఫికెట్స్‌లో ప్రధానమంత్రి ఫొటో చేర్చడంపై… కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. రెండు నెలల క్రితం పార్లమెంటులో ఆరోగ్యమంత్రి బి.పి పవార్‌ దీనిని సమర్థించారు. సర్టిఫికెట్‌పై మోడీ ఫొటో ఉంటే… అవగాహన పెంచడానికి ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. మంత్రి వ్యాఖ్యలను కాంగ్రెస్‌, విపక్ష సభ్యులు ఖండించారు.