నిబంధనల నడుమ అయ్యప్ప ఆలయదర్శనం

దీపావళి తరువాత శబరిమల ఆలయ దర్శనం సాధారణ ప్రజలకు అందుబాటులో రానున్నది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల ప్రవేశానికి సంబంధించి ఆలయం బోర్డు నిబంధనలు సిద్ధం చేసింది. నవంబర్ 16 నుంచి అయ్యప్ప దర్శనాలకు అవకాశాలు ఉన్నాయి. ఆలయంలో దర్శనం చేసుకోవ డానికి ప్రత్యేక కమిటీ కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది.

ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అయ్యప్ప స్వామి దర్శనం గురించి వివరించే స్థితిలో లేనందున ప్రత్యేక కమిటీ తన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. శబరిమల ఆలయాన్ని సందర్శించే ప్రతి భక్తుడు దర్శనానికి ముందు 14 రోజులు, దర్శనం తర్వాత 10 రోజులు స్వీయ నిర్బంధంలో గడపాల్సి ఉంటుంది. ఆలయంలో జరిపే పూజలకు ఎవరినీ అనుమతి లభించదు. సెప్టెంబర్ 16 నుంచి 21 వరకు నెలవారీ ఆరాధన కోసం ఆలయం తెరుస్తారు. అయితే ఈ సమయంలో భక్తులకు ప్రవేశానికి అనుమతించరు. మకరవిలక్కు సందర్భంగా మార్గదర్శకాలను రూపొందించే పనిలో ప్రభుత్వం ఉన్నది.

శబరిమల ఆలయానికి నవంబర్-డిసెంబర్ ఈ రెండు నెలలు ప్రత్యేకమైనవి. మలయాళ క్యాలెండర్‌లో వీటిని మండలం, మకరవిలక్కు నెల అంటారు. ఈ నెలల్లో అయ్యప్ప స్వామి తత్వశాస్త్రానికి ఇక్కడ ప్రాముఖ్యం ఉన్నది. ఆలయంలో ప్రత్యేక కార్యక్ర మాలు జరుగుతాయి. సుమారు 45 రోజుల పాటు భక్తులు స్వామి దర్శనం కోసం భక్తులు తరలి వస్తారు.

ప్రత్యేక కమిటీ నిబంధనలు..

50 ఏండ్ల వయసు పైబడిన వారికి  ఆలయ సందర్శనకు అనుమతిలేదు. ఆలయ సందర్శనకు ముందు 14 రోజుల స్వీయ నిర్బంధకాలం అవసరం. దర్శనం అనంతరం కూడా 10 రోజుల స్వీయ నిర్బంధ కాలం ఉంటుంది. 5000 మందికి ఒకేసారి ఆలయంలో ప్రవేశం లభించనున్నది. ఆలయంలో క్రమం తప్పకుండా కొవిడ్ -19 టెస్టులు జరుపాలి. ఈ నియమాలు ఉద్యోగులకు కూడా వర్తిస్తాయి. ప్రధాన పూజల సమయంలో 50 మంది మాత్రమే హాజరవ్వాలి. ఆన్‌లైన్ అనుమతులు, వర్చువల్ క్యూ సిస్టమ్స్, ప్రసాదం వంటి వాటిని తిరస్కరించడం కోసం కూడా సూచనల లో భాగంగా ఉన్నాయి.