జి20 వేదికగా బైడెన్‌, మాక్రాన్‌ ముఖాముఖి

అణుజలాంతర్గాముల కొనుగోలు వివాదం తరువాత అమెరికా, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు జో బైడెన్‌, ఇమ్మానియేల్‌ మాక్రాన్‌ తొలిసారిగా ముఖాముఖి సమావేశం కానున్నారు. ఇందుకు ఇటలీ రాజధాని రోమ్‌లో శనివారం నుంచి రెండు రోజుల పాటు జరిగే జి-20 సదస్సు వేదిక కానుంది. ఇది రాజకీయంగా ముఖ్యమైనదని మాక్రాన్‌ కార్యాలయం పేర్కొంది. అణు జలాంతర్గాముల కొనుగోలుకు సంబంధించి అమెరికా, బ్రిటన్‌లతో ఆస్ట్రేలియా గతనెల కుదుర్చుకున్న ఒప్పందం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఐదేళ్ల క్రితం తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కాదని.. అమెరికా, బ్రిటన్‌లతో ఆస్ట్రేలియా వెళ్లడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది తమను వెన్నుపోటు పొడవడమేనని పేర్కొంటూ అమెరికా, ఆస్ట్రేలియా దేశాల నుంచి ఫ్రాన్స్‌ అధ్యక్షులు మాక్రాన్‌ ఆగమేఘాల మీద తమ రాయబారులను వెనక్కు రప్పించారు. ఈ ఒప్పందం ఫ్రాన్స్‌ను విస్మయానికి గురిచేయడంతో పాటు చిరకాల మిత్రుడిగా ఉన్న అమెరికా విధేయతపై యూరప్‌కు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఈ వివాదం తరువాత బైడెన్‌, మాక్రాన్‌ తొలిసారిగా కలుసుకోనుండడం ప్రాధాన్యత సంతరించుంది. బైడెన్‌, మాక్రాన్‌లిద్దరు ఇప్పటికే రెండుసార్లు ఫోన్‌ ద్వారా సంభాషించుకున్నారు.