వాహన బీమా రెన్యువల్‌కు పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి

దేశంలో ఇకపై మోటారు వాహనాల బీమాను రెన్యువల్‌ చేసేందుకు పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి కానుంది. ఈ మేరకు ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఆర్డీఏఐ) బీమా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. వాహనానికి ప్రమాదం జరిగిన సమయంలో పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేనట్లయితే.. సదరు వాహనాలకు పరిహారం లభించదని కూడా సంస్థ వెల్లడించింది. అన్ని బీమా క్లెయిముల చెల్లింపునకు ఈ పత్రం తప్పనిసరని స్పష్టం చేసింది.

పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేని వాహనాలకు బీమా సంస్థలు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించరాదని గతంలో సుప్రీం కోర్టు కూడా ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీఈబీ) కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని దేశంలోని అన్ని బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ నోటీసులు జారీ చేసింది.