కర్ణాటకపై బ్లాక్ ఫంగస్ పంజా: వారంలో 700 కేసులు

కరోనా రెండో వేవ్‌లో అధిక కేసులతో అల్లాడిపోతున్న కర్ణాటకపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతున్నది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిపై కేవలం వారం రోజుల్లో సుమారు 700 బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకోర్‌మైసిస్ కేసులు నమోదు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ పరిస్థితిపై నిపుణులు అధ్యయనం చేయనున్నారు.

రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ వ్యాప్తి, దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై డిప్యూటీ సీఎం డాక్టర్ సీఎన్ అశ్వథ నారాయణ సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఇన్ఫెక్షన్‌కు కారణాలు నిర్ధారించడానికి ఈ సమీక్షా సమావేశంలో పలువురు నిపుణులు కూడా పాల్గొన్నారు.

బ్లాక్ ఫంగస్ సోకిన వారందరికి కరోనా చికిత్స కోసం ఆక్సిజన్ సరఫరా చేసిన సంగతిని నిపుణుల కమిటీ నిశితంగా పరిశీలించనున్నది. పలువురు మైక్రోబయాలజిస్టులతో కూడిన కమిటీ సోమవారం నుంచి పూర్తి స్థాయిలో అధ్యయనం చేపడుతుంది.

తక్కువ నాణ్యతతో కూడిన ఆక్సిజన్ సిలిండర్లు, తక్కువ నాణ్యత గల ఐసీయూ పైపింగ్ వ్యవస్థల వల్ల రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసుల నమోదు పెరుగుతుండవచ్చునని మణిపాల్ హాస్పిటల్ స్కల్ సర్జన్ డాక్టర్ సంపత్ చంద్ర ప్రసాదరావు అంచనా వేశారు.

వాటర్ స్టెరిటైజేషన్‌లో ప్రమాణాలను సరిగ్గా పాటించకపోవడం వల్ల రోగులకు సరఫరా చేసిన ఆక్సిజన్ విషపూరితం కావచ్చునని చెప్పారు. డాక్టర్ సంపత్ చంద్ర ప్రసాద్ రావు ఈ మేరకు బ్లాక్ ఫంగస్ రాష్ట్రంలో పెరగడానికి కారణాలపై నిపుణులకు ప్రెజెంటేషన్ సమర్పించారు.

సాధారణ నల్లా నీటితో తయారు చేసిన ఆక్సిజన్ వాడినా బ్లాక్ ఫంగస్ కేసులు రెట్టింపయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్లాక్ ఫంగస్ సోకిన రోగుల పూర్తి కేసు హిస్టరీ రికార్డులు, దవాఖానకు సరఫరా చేసిన ఆక్సిజన్ డేటా, పైపింగ్ అండ్ సిలిండర్ల క్వాలిటీని పూర్తిస్థాయిలో తనిఖీ చేయనున్నారు.

వెంటిలేటర్లలో నింపిన ఆక్సిజన్ తయారు చేయడానికి వాడిన నీరు, ఇండస్ట్రీ/ ప్లాంట్ స్థాయిలో నాణ్యత ప్రమాణాలనూ నిపుణులు మదింపు చేయనున్నారు. బ్లాక్ ఫంగస్ సోకిన రోగులకు చికిత్స ప్రారంభించాలని రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలు, తాలుకా హాస్పిటళ్లను ఇటీవలే కర్ణాటక సర్కార్ ఆదేశించింది.