ఉల్లి ఎగుమతులపై నిషేధం విదించిన కేంద్రం

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అందుకుంటున్న తరుణంలో కేంద్రం తాజా నిర్ణయం. నాణ్యతలేని ఉల్లిని అధిక ధరలకు విక్రయిస్తున్నoదున నివారణ చర్యగా అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. తక్షణమే ఈ నిషేధం అమలులోకి వస్తుందని పేర్కొంటూ విదేశీ వాణిజ్య డైరెక్టర్‌ జనరల్‌ (డీజీఎఫ్‌టీ) ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశంలో ఉల్లిపాయల లభ్యతను పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో పంటలపై తీవ్ర ప్రభావం పడిందని, దీని ఫలితంగా నెలలోనే ఉల్లిధర మూడు రెట్లు పెరిగినట్టు పేర్కొంది.

దక్షిణాసియా దేశాల వంటకాల్లో ప్రధానంగా వాడే ఉల్లిపాయల ఎగుమతిదారుల్లో భారత్‌కు  ప్రముఖ స్థానంఉంది. బంగ్లాదేశ్, నేపాల్‌, మలేషియా, శ్రీలంక తదితర దేశాలు ఉల్లికోసం భారత్‌పైనే ఆధారపడతాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లిపాయల వాణిజ్య కేంద్రమైన లాసల్‌గావ్‌లో నెల వ్యవధిలోనే టన్ను ఉల్లిధరలు మూడు రెట్లు పెరగడం గమనార్హం. ఈ మార్కెట్‌లో ప్రస్తుతం టన్ను ధర రూ.30 వేలును చేరుకుంది.