‘చందమామ’ చిత్రకారుడు శంకర్ కన్నుమూత

భారతదేశంలో విశేషంగా పాఠకాదరణ పొందిన బాలల మాస పత్రిక ‘చందమామ’లో దశాబ్దాల పాటు వేలాది చిత్రాలను గీసిన శంకర్ మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. 97 సంవత్సరాల శంకర్ వయోభారంతో ఎదురైన అనారోగ్యం కారణంగా చెన్నైలోని పోరూరు సమీపంలో ఉన్న మదనంతపుర ప్రాంతంలో తన కుమార్తె ఇంట్లో మృతిచెందారు. 1924 జులై 19న జన్మించిన శంకర్ లైన్ డ్రాయింగ్ అప్పట్లో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. 97 ఏళ్ల వయసులోనూ చందమామ గురించి, దాంట్లో తాను వేసిన చిత్రాల గురించే ఆలోచిస్తూ మానసికంగా బాగా బలహీనులయ్యారని ఆయన కుమార్తె తెలిపారు. గత 20 రోజులుగా సైక్రియాటిస్టు ఆయనకు వైద్య సేవలందించారు. 20 రోజులుగా మంచినీళ్లు తప్ప మరేమీ తీసుకోలేదట. ఇక, ఇవాళ సాయంత్రమే ఆయన అంత్యక్రియలను నిర్వహించారు కుటుంబసభ్యులు. శంకర్ కన్నుమూతతో చందమామ చిత్రకారుల్లో చివరిశకం కూడా ముగిసినట్టు అయ్యింది.. తన 700 పైగా బేతాళకథలకు దాదాపుగా ఈయనే చిత్రాలు గీశారు.