మహిళలతోనే మార్పు.. యూపీ ఎన్నికల్లో 40శాతం సీట్లు రిజర్వ్..

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. యూపీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కీలక ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 టిక్కెట్లు కేటాయిస్తామని ప్రియాంక గాంధీ స్పష్టంచేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై సమీక్షిచేందుకు మంగళవారం లక్నోలో ప్రియాంక నాయకులతో చర్చించారు. అనతంరం ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు మార్పు తీసుకురాగలరని, వారు మరో అడుగు ముందుకు వేయాల్సి ఉందంటూ పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాలికల కోసం, మార్పును కోరుకునే మహిళల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టంచేశారు. లఖింపూర్ హింస అనంతరం తనను నిర్బంధించి, సీతాపుర్ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లిన మహిళా పోలీసు సిబ్బంది కోసం కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రియాంక పేర్కొన్నారు. దేశంలో ఉన్న విద్వేష రాజకీయాలను మహిళలు మాత్రమే అంతం చేయగలరని.. తనతో కలిసి పనిచేయాలంటూ ప్రియాంక మహిళలను కోరారు.

2022 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా యూపీలో పార్టీని పునరుద్ధరించే బాధ్యతను ప్రియాంకకు పార్టీ అధిష్టానం అప్పగించింది. ఈ క్రమంలో యూపీ ఎన్నికల్లో 40 శాతం టిక్కెట్లు మహిళలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు ప్రియాంక గాంధీ మీడియాకు తెలిపారు. గత నెలలుగా ప్రియాంక యూపీలో వరుస పర్యటనలు చేస్తున్నారు. దీంతోపాటు పార్టీ కార్యకర్తలతో తరచు సమావేశమవుతూ.. ఎన్నికలపై సమాలోచనలు చేస్తున్నారు. ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ లక్నోలో నివాసం ఉండేందుకు ఆమె ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో యూపీలో వరుస పర్యటనలకు సైతం ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొంటున్నారు. 75 జిల్లాల్లో పర్యటన, ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పొత్తుల సాధ్యాసాధ్యాలు గురించి చర్చిస్తున్నారు. కాగా.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. అయితే 7 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచిన సంగతి తెలిసిందే.