ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం

ఐపీఎల్ 2020లో భాగంగా అబూధాబీలో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఐదు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెన్నై బ్యాట్స్‌మెన్ రాయుడు అద్భుతమైన ఆటతో ఆకట్టుకొన్నాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. అతడికి డుప్లెసిస్ తో పాటు శామ్ కుర్రాన్ మెరుపులు తోడవడంతో ముంబై విసిరిన 163 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ఈజీగానే ఛేజ్ చేసింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 రన్స్ చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో సౌరభ్ తివారీ (31 బంతుల్లో 42 పరుగులు, 3 ఫోర్లు, 1 సిక్సర్‌), క్వింటన్ డికాక్ (20 బంతుల్లో 33 పరుగులు, 5 ఫోర్లు)లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఆపై ముంబై వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్‌ చేసే అవకాశం ఉన్నా అది సాధ్యం కాలేదు. చెన్నౌ బౌలర్లలో లుంగి ఎంగిడికి 3 వికెట్లు దక్కగా, దీపక్ చాహర్‌, రవీంద్ర జడేజాలు చెరో 2 వికెట్లు తీశారు. శామ్ కుర్రాన్‌కు 1 వికెట్ దక్కింది.

అనంతరం బ్యాటింగ్ చేపట్టిన చెన్నై ఓపెనర్లు కొద్దిపరుగులకే పెవిలియన్ చేరారు. అయితే తరువాత వచ్చిన అంబటి రాయుడు, డూప్లెసిస్ అద్భుతమైన ఆటతో జట్టును ఆదుకున్నారు. అర్థ సెంచరీలతో రాణించారు. అంబటి రాయుడు 48 బంతుల్లో 71 పరుగులు (6 ఫోర్లు, 3 సిక్సర్లు) చేయగా.. డూప్లెసిస్ 44 బంతుల్లో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి చెన్నై విజయకేతనం ఎగురవేసింది.