కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ఖర్చంతా కేంద్రానిదే: ప్రధాని మోడీ

దేశ వ్యాప్తంగా కోవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. శనివారం ఉదయం 10 గంటల 30 నిముషాలకు వర్చువల్‌ విధానంలో ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రారంభం సందర్భంగా.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తోందని, వ్యాక్సిన్‌ రూపకల్పనకు శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడ్డారని అన్నారు. శాస్త్రవేత్తల కృషికి ఫలితంగా రెండు కోవిడ్‌ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని, మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. దేశీయ వ్యాక్సిన్‌ ద్వారా భారత్‌ తన సత్తాను ప్రపంచానికి చాటిందన్నారు. తక్కువ సమయంలోనే భారతదేశానికి టీకా వచ్చిందని తెలిపారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ఖర్చంతా కేంద్రానిదేనని మోడీ స్పష్టం చేశారు.

1075 కాల్‌ సెంటర్‌ ద్వారా టీకా పంపిణీ సందేహాల నివృత్తి..

టీకా పంపిణీకి దేశవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. తగినన్ని డోసుల ‘కోవిషీల్డ్‌’, ‘కోవాగ్జిన్‌’ సిద్ధంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలూ కోవిడ్‌ టీకా పంపిణీకి సన్నద్ధమయ్యాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 3006 వ్యాక్సినేషన్‌ సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. తొలి రోజు ప్రతీ సెంటర్లో 100 మందికి కోవిడ్‌ టీకాను ఇవ్వాలని నిర్ణయించారు. తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల వైద్యులు, వైద్య సిబ్బందికి టీకా వేయబోతున్నారు. దేశవ్యాప్తంగా 1075 కాల్‌ సెంటర్‌ ద్వారా కోవిడ్‌ టీకా పంపిణీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.