కొత్త వైరస్ స్ట్రెయిన్‌ను ప్రస్తుత టీకాలు అడ్డుకోగలవు

ప్రపంచ దేశాలను కొత్త వైరస్ కలవర పెడుతోంది.  అయితే కొత్త వైరస్ స్ట్రెయిన్‌ను ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా టీకాలు అడ్డుకోగలవని జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి యన్స్ స్ఫాన్ తెలిపారు. ఐరోపా దేశాల నిపుణులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు. ‘ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతమున్న టీకాలపై కొత్త కరోనా స్ట్రెయిన్‌ ఎటువంటి ప్రభావం చూపించదు. టీకాల ప్రభావంలో ఎటువంటి మార్పూ లేదు. ఐరోపా దేశాల నిపుణులు అభిప్రాయం ఇదే’ అని ఆయన వ్యాఖ్యనించారు. బ్రిటన్, అమెరికా ప్రభుత్వాలు ఫైజర్ టీకా వినియోగానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. ఈ విషయమై చర్చించేందుకు ఐరోపా శాస్త్రవేత్తలు ఆదివారం నాడు సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే వారు ఈ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.

బ్రిటన్‌లో కళ్లు తెరిచిన కొత్త కరోనాను చూసి ఐరోపా దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే బ్రిటన్‌కు అంతర్జాతీయ విమానసర్వీసులను రద్దు చేశాయి. తమ దేశంలోకి బ్రిటన్ ప్రజలను అనుమతించమంటూ ఫ్రాన్స్ విస్ఫష్ట ప్రకటన చేసింది. ఇక బ్రిటన్‌లో కొత్త స్ట్రేయిన్ నిలువరిరంచేందుకు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా లండన్‌లో అత్యంత కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. ఆదివారం నాటికి..కొత్త స్ట్రేయిన్‌కు సంబంధించి తొమ్మిది కేసులు, నెదర్‌ల్యాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీలో చెరో ఒక కేసు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. బ్రిటన్‌ నుంచి స్వదేశానికి వచ్చిన ఓ ఫ్రాన్స్ పౌరుడు కొత్త కరోనా బారిన పడ్డట్టు సమాచారం. వ్యాధిని వ్యాప్తిని చేయడంలో కొత్త కరోనా స్ట్రేయిన్ సామర్థ్యం 70 శాతం ఎక్కువని బ్రిటన్ ప్రధాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌లో జన్యు మార్పులు సులభంగా జరిగే అవకాశం ఉన్నందునే కొత్త స్ట్రేయిన్ పుట్టుకొచ్చిందని నిపుణులు చెబుతున్నారు.