దాద్రా అండ్‌ నగర్‌హవేలీ ఎంపీ ఆత్మహత్య!

న్యూఢిల్లీ : దాద్రా అండ్‌ నగర్‌హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ (58) సోమవారం ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సౌత్ ముంబైలోని ఓ హోటల్‌లో ఆయన మృతదేహం లభ్యమైంది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తమై పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గుజరాతీ భాషలో ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. మోహన్ దేల్కర్ ఏడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుత లోక్‌సభలో లా అండ్‌ జస్టిస్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. గిరిజన హక్కు ల కోసం పోరాడే ట్రేడ్‌ యూనియన్‌ నేతగా మోహన్‌ తన కెరీర్‌ను ప్రారంభించారు. దాద్రా అండ్‌ నగర్‌హవేలీ నియోజకవర్గం నుంచి 1989లో మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. వరుసగా ఆరుసార్లు గెలిచారు. 2009, 2014లో ఓడిపోయినప్పటికీ 20 19లో స్వతంత్ర అభ్యర్థిగా మళ్లీ గెలిచారు. గతంలో ఆయన కాంగ్రెస్‌, భాజపాలో ఉన్నారు.