‘కరోనిల్’‌పై పతంజలి వివరణ..

న్యూఢిల్లీ: కోవిడ్-19కి సంబంధించి తాము ఎలాంటి సంప్రదాయకమైన ఔషధాన్ని పరిశీలనలోకి తీసుకోలేదని, ధ్రువీకరించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్వీట్ చేయడంతో పతంజలి ఆయుర్వేద్‌ కంపెనీ అభివృద్ధి చేసిన ‘కరోనిల్‌’ వ్యాక్సిన్‌ మరోసారి వివాదంలో చిక్కుకుంది. కరోనిల్‌కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి ఇచ్చిందంటూ పతంజలి తప్పుదారి పట్టించిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. శాస్త్రీయ పరిశోధానా పత్రాన్ని బాబా రామ్‌దేవ్ ఈనెల 19న జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేయడం, ఆ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి హర్షవర్ధన్ సహా మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొనడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే డబ్ల్యూహెచ్ఓ చేసిన ప్రకటన మరోసారి సంచలన మైంది. దీనిపై పతంజలి సంస్థకు చెందిన ఆచార్య బాలకృష్ణ తాజాగా వివరణ ఇచ్చారు. కరోనిల్‌కు డబ్ల్యూహెచ్ఓ జీఎంపీ కాంప్లియంట్ సీఓపీపీ సర్టిఫికేట్‌ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) జారీ చేసిందని, డబ్ల్యూహెచ్ఓ కాదని తెలిపింది.

‘ప్రస్తుత గందరగోళంపై మేము వివరణ ఇవ్వాలనుకుంటున్నాం. కరోనిల్‌కు జీఎంపీ కాంప్లియంట్ సీఓపీపీ సర్టిఫికెట్‌ను భారత ప్రభుత్వానికి చెందిన డీసీజీఐ ఇచ్చింది. డబ్ల్యూహెచ్ఏ ఏ డ్రగ్‌ను ఆమోదించడం కానీ, ఆమోదించకపోవడం కానీ ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు మెరుగైన, ఆరోగ్యకరమైన భవిష్యత్‌ అందించే దిశగా డబ్ల్యూహెచ్ఓ పనిచేస్తుంది’ అని ఆచార్య బాలకృష్ణ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓ జీఎంపీ క్వాలిటీ అప్రూవల్స్‌కు అనుగుణంగానే సీపీపీ లైసెన్స్ జారీ అయిందని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.