టీకాలు తీసుకోనివారిలో డెల్టా వ్యాప్తి: డబ్ల్యూహెచ్‌వో

ఇంతవరకు గుర్తించిన కరోనా వైరస్‌ వేరియంట్లలో అత్యంత వేగంగా సంక్రమణం చెందుతున్నది డెల్టా రకమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. కొవిడ్‌-19 టీకాలు తీసుకోనివారిలో ఈ రకం శరవేగంగా వ్యాపిస్తోందని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో డెల్టా రకాన్ని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో అధిపతి టెడ్రోస్‌ అధనోమ్‌ తెలిపారు. డెల్టా రకంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నట్లు సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఘెబ్రెయేసస్‌ పేర్కొన్నారు. ఈ దశలో కొన్ని దేశాల్లో కొవిడ్‌ నిబంధనలను సడలించడం కూడా ఆందోళనకరమేనన్నారు. ప్రపంచవ్యాప్తంగా దీని సంక్రమణం పెరగడం ప్రారంభమైందన్నారు. కేసులు పెరుగుతున్న కొద్దీ ఆసుపత్రిలో చేరడాలు, ఆరోగ్య సంరక్షణ విధానంపై ఒత్తిడి, మరణాల ముప్పు కూడా పెరుగుతాయన్నారు. ఈమేరకు వైరస్‌ సంక్రమణాన్ని నిరోధించేందుకు ఉన్న అన్ని సాధానాలన్నీ ఉపయోగించడం అత్యవసరమని స్పష్టం చేశారు. డెల్టా రకం గతంలో ఐరోపాలో తీవ్రంగా వ్యాప్తి చెందిన ‘ఆల్ఫా’ కంటే ప్రమాదకరమని డబ్ల్యూహెచ్‌వో కొవిడ్‌-19 టెక్నికల్‌ లీడ్‌ డాక్టర్‌ మారియా వాన్‌ కెర్ఖోవ్‌ హెచ్చరించారు. ఈ దశలో వ్యాధి తీవ్రమయ్యే ముప్పును, మరణాలను కొవిడ్‌ వ్యాక్సిన్లు సమర్థంగా అడ్డుకుంటాయని.. డెల్టా రకంపై అవి చక్కగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. ప్రజలు పెద్దఎత్తున గుమిగూడటం వంటివాటి వల్ల తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.