గడప గడపకు స్టిక్కర్ల కోసం రూ.వందల కోట్లు కేటాయిస్తారా?

• సీఎం స్టిక్కర్ల కోసం బడ్జెట్ పెట్టినట్లున్నారు
• ప్రతిపాదనలు భారీగా… ఆపైన సవరించిన అంచనాల పేరుతో కోతలు
• వైసీపీ ప్రభుత్వ అప్పుల చిట్టా చూస్తే రూ.5,05,975 కోట్ల రుణ భారం తేలింది
• ప్రభుత్వ ఆర్థిక డొల్లతనం చూపించిన బడ్జెట్ ఇది

బడ్జెట్లో కేటాయింపుల ఘనమే తప్ప ఆచరణలో మంజూరు అరకొర అని వైసీపీ పాలన ద్వారా వెల్లడవుతోంది. 2023-24లో కూడా ఆంధ్ర ప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల హంగామా తప్ప మరేమీ లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో పెదవి విరిచారు. ప్రజలకు కావలసిన మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు గురించి కాకుండా ఇళ్లకు సిక్కర్లు, సెల్ ఫోన్లకు స్టిక్కర్లు అతికించడానికి కూడా నిధులు ఇవ్వడాన్ని ఏమనాలి? గడప గడపకు అని ఇళ్లకు వైసీపీ నాయకులు తిరిగారు. ఇప్పుడు ఇళ్లకు, సెల్ ఫోన్లకు స్టిక్కర్లు వేసేందుకు గడప గడపకు ప్రభుత్వం అనే స్కీమ్ పెట్టి రూ.532 కోట్లు ప్రతిపాదించడం విడ్డూరం. ఆ కార్యక్రమంలో వచ్చిన ప్రజా సమస్యల కోసం అని చెప్పడం ఎవర్ని మోసం చేయడానికి? ప్రజలు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించడానికి రూ.లక్ష కోట్లు పైగా కేటాయించాలి. వీళ్ళు ఇవ్వబోయే నిధులు ముఖ్యమంత్రి స్టిక్కర్లకే అని ప్రజలు గ్రహించాలి.
భారీ లెక్కలు, అంచనాలు చూపించి ఆ తరవాత సవరించిన అంచనాల పేరుతో కేటాయింపుల్లో కోతలు వేస్తోంది వైసీపీ కోతల ప్రభుత్వం. వైద్య, విద్యా శాఖల్లోనే కాదు సామాజిక భద్రతకు సంబంధించిన వాటిలోనూ సవరించిన అంచనాల్లో కోతలు ఎక్కువగా ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖకు గత ఆర్థిక సంవత్సరం కేటాయింపులను కూడా సక్రమంగా ఇవ్వలేదు. సవరించి రూ.2 వేల కోట్లు తగ్గించారు. 2023-24 బడ్జెట్లో మాత్రం కేటాయింపులు ఎక్కువగానే చూపించారు. ప్రజలను మభ్యపెట్టేందుకే ఇలాంటి అంకెల గారడీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎలా అటకెక్కించారో అందరికీ తెలుసు. ఆరోగ్యశ్రీలో ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల వరకూ బకాయిలు ఉండటంతో పేదలకు వైద్య సేవలు సక్రమంగా అందటం లేదనేది వాస్తవం. మన బడి నాడు-నేడు విషయంలోనూ ప్రభుత్వ ఆర్థిక దివాళాకోరుతనం కనిపిస్తోంది. ఈ పనులకు సంబంధించి రెండు దశల్లో రూ.8 వేల కోట్లు ప్రతిపాదించి రూ.2 వేల కోట్లు కేటాయించారు. ఇందులో ఇప్పటికీ రూ.1500 కోట్లు బకాయిలే ఉండటంలో పనులు ఆగిపోయిన విషయం వాస్తవం. తాజా బడ్జెట్లో నాడు నేడు కోసం రూ.3500 కోట్లు ప్రతిపాదించాం అని చెప్పి ప్రజల కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం చేశారు.
• ఆర్థిక డొల్లతనం
రాష్ట్ర బడ్జెట్ ను రూ.2.79 లక్షల కోట్లు అని చూపిస్తున్నారు. ఇందులో అప్పులు, కేంద్ర సాయం, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలే రూ.1.61 లక్షల కోట్లు ఉందని గుర్తించాలి. రాష్ట్ర సొంత రాబడులు పెంచుకొనే ప్రయత్నాలు ఏమీ లేవు. బడ్జెట్ పరిధిలోకి వచ్చే అప్పులకే ఏటా రూ.41 వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇక కార్పొరేషన్ల అప్పులకు ఇంకెంత కట్టాలో ప్రభుత్వం ఏనాడూ చెప్పడం లేదు. కేంద్ర సాయంగా వచ్చే నిధులను కూడా వినియోగించడం లేదు. కాబట్టే గ్రాంట్ ఇన్ ఎయిడ్ మొత్తాలు ఏటేటా తగ్గుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్లు తెచ్చిన అప్పులు, తాజా అప్పు ప్రతిపాదనలు కలిపితే ఋణ భారం రూ.5,05,975 కోట్లు అయింది. ప్రభుత్వ ఆర్థిక డొల్లతనాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం కలిగించని బడ్జెట్ ఇది. ఇందులో ఆత్మస్తుతి కోసం రాసుకున్న కొటేషన్లు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం కేటాయింపు ప్రతిపాదనలు లేవని శ్రీ నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు.