అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళాల వెల్లువ..

అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళాల వెల్లువ మొదలైంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటించగా.. గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారులు కోట్ల రూపాయల విరాళాలు అందిస్తూ రాముడిపై తమ భక్తిని చాటుకుంటున్నారు. సూరత్ కు చెందిన ప్రముఖ వజ్రాల విక్రేత గోవింద్ భాయ్ డోలాకియా ఏకంగా రూ.11 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. అంతేకాదు, సూరత్ లోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయానికి వెళ్లి స్వయంగా విరాళం తాలూకు చెక్ ను అందించారు. ఆయనే కాదు, సూరత్ కు చెందిన మహేశ్ కబూతర్ వాలా రూ.5 కోట్లు ఇవ్వగా, లవ్ జీ బాద్షా రూ.1 కోటి విరాళంగా అందించారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2 లక్షల రూపాయల విరాళం అందించారు. ఈ మేరకు యూపీ సమాచారశాఖ వెల్లడించింది.  ప్రారంభంలోనే భారీగా విరాళాలు రావడం పట్ల హిందుత్వ వాదుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసిన తర్వాత రామమందిర నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలయ నిర్మాణానికి ఇటీవలే శంకుస్థాపన చేశారు.

ఆలయ నిర్మాణం కోసం పలువురు ప్రముఖుల నుంచి విరాళాలు సేకరించాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూ. 5,00,100 విరాళం ప్రకటించారు.