తాలి’బ్యాన్’… తాలిబన్లకు ఫేస్ బుక్ కట్..

తాలిబన్లకు సంబంధించిన ఏ సమాచారానికి తమ వేదికలో స్థానం లేదని స్పష్టం చేసింది ఫేస్ బుక్ తమ సేవలు వినియోగించుకునే అవకాశం లేకుండా తాలిబన్లపై నిషేధం విధించినట్టు ప్రకటించింది ఎఫ్‌బీ.. ఇప్పటికే తాలిబన్లకు సంబంధించిన ఖాతాలను తొలగించినట్టు వెల్లడించింది. తాలిబన్ల మూమెంట్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, సమాచారం సోషల్ మీడియాకు ఎక్కుతున్నాయి.. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రభుత్వం తాలిబన్లను ఉగ్రవాదులుగా పేర్కొనడంతో తాలిబన్లకు సంబంధించి ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. ఇకపై తాలిబన్లకు సంబంధించిన సమాచారంపై ఓ కన్నేసి ఉంచుతామని.. దానికోసం ప్రత్యేకంగా ఒక టీమ్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది ఫేస్‌బుక్. ఆఫ్ఘానీ భాషలైన డారీ, పాష్తోలలో ప్రావీణ్యం ఉన్న స్థానికులను ఆ స్పెషల్ టీమ్‌లో సభ్యులుగా చేర్చింది. స్థానిక పరిస్థితులపై లోతైన అవగాహన ఉన్న వీరు.. ఫేస్‌బుక్‌లో తాలిబన్లకు సంబంధించిన సమాచారం కోసం జల్లెడపడుతూ.. సంస్థను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటారు.. మొత్తంగా.. తాలిబన్లకు సంబంధించిన ఏ ఒక్క సమాచారాన్ని కూడా ఫేస్‌బుక్ వేదికగా పంచుకునే వీలులేకుండా చర్యలకు పూనుకుంది.