రైతులు సాగు నీటి కోసం రోడ్డెక్కే పరిస్థితి తీసుకువచ్చారు

• అన్నదాత కష్టాల్లో ఉంటే పాలకుల్లో స్పందన లేదు
• స్పందించే గుణం లేని ప్రభుత్వం స్పందన కార్యక్రమం నిర్వహిస్తోంది
• వ్యవసాయం, నీటి పారుదల రంగాల పట్ల వైసీపీకి చిత్తశుద్ది లేదు
• జనసేన ప్రభుత్వంలో గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగిస్తాం
• వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం రైతులు కలసి రావాలి
• గుంటూరులో నల్లమడ రైతు సంఘం దీక్షలో జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
• రైతుల పోరాటానికి జనసేన తరఫున సంఘీభావం

రైతులు నీటి కోసం పోరాటం చేసే పరిస్థితులు రావడం దారుణమని.. రైతుని నిర్వీర్యం చేసేందుకు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వానికి వ్యవసాయం, నీటిపారుదల రంగాల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. రైతులు కష్టాల్లో ఉన్నా ఈ ప్రభుత్వానికి స్పందన లేదనీ, స్పందించే గుణం లేని ప్రభుత్వం స్పందన కార్యక్రమం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం రైతాంగం కలసి రావాలని కోరారు. జనసేన పార్టీ ప్రభుత్వంలో గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట గత 11 రోజులుగా నిర్వహిస్తున్న నిరసన దీక్షలో పాల్గొని జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలిపారు. గుంటూరు ఛానల్ పొడిగింపు ఆవశ్యకతను రైతులు, మహిళా రైతుల మాటల్లో విన్నారు. అనంతరం శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “ప్రతి అడుగులో పొరపాట్లు చేస్తూ.. ప్రజల్ని మభ్యపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతుని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలి. వ్యవసాయం, నీటిపారుదల రంగాలపై వైసీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ది లేదు. ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానాలు ఎంత వరకు అమలు చేశారు.. ప్రజలకు ఏం చేశారో తెలిసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
• రైతులకు అండగా..
రైతుని కాపాడాలని, కష్టాల్లో ఉన్నవారిని నిలబెట్టాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచారు. ఆర్టీఐ ద్వారా లెక్కలు తెప్పించుకుంటూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని లెక్కలు చూసి విస్తుపోయాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందుగా స్పందించి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలన్న సంకల్పంతో తనవంతు రూ. 5 కోట్ల విరాళం అందించారు. ప్రకాశం జిల్లా, పర్చూరులో 74 మంది రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో గుంటూరు ఛానల్ పొడిగింపు అంశంపై వినతిపత్రం అందచేశారు.
• శ్రీ పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని చెప్పేందుకే..
ఈ ప్రభుత్వం కేవలం ప్రకటనలకు పరిమితమవుతోంది తప్ప రైతులు కష్టాల్లో ఉన్నారని తెలిసి కూడా స్పందన లేదు. నల్లమడ రైతు సంఘం తరఫున డాక్టర్ రాజమోహన్ గారు స్పందనలో ఎన్నోసార్లు అర్జీలు సమర్పించారు. గుంటూరు ఛానల్ పొడిగించే క్రమంలో 128 ఎకరాల భూ సేకరణ కోసం డబ్బు చెల్లించకపోతే ఏం చేస్తోంది ఈ ప్రభుత్వం. ఆయా గ్రామాల్లో ప్రజలు తాగు నీరు, సాగు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఏ ప్రాంతానికి వెళ్లినా ఇదే సమస్య. చేతకాని ప్రభుత్వం. పులిచింతల గేటు విరిగి రెండేళ్లు పూర్తికావస్తున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో మరమ్మతులకు నోచుకోని దుస్థితి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా చేస్తున్న విషయం తెలిసి ఖచ్చితంగా ఈ పోరాటానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారని చెప్పేందుకే సంఘీభావం తెలియచేస్తున్నాం. రైతులు నాలుగు దశాబ్దాలుగా అర్జీలు పెట్టి పెట్టి అలసిపోయారు.
• జనసేన మీ వెంట ఉంటుంది
ఎన్నికల ముందు ముద్దులు పెట్టుకుంటూ చేసిన పాదయాత్రలో పర్చూరు పరిసరాల్లో నిర్వహించిన సభల్లో ఇదే ముఖ్యమంత్రి మాటిచ్చారు. ఈ రోజున కర్నూలు జిల్లాలో రైతులకు భరోసా ఇస్తున్నామంటూ కార్యక్రమం ఏర్పాటు చేశారు. క్షేత్ర స్థాయిలో చూస్తే రైతుకి ఎలాంటి భరోసా కల్పించడం లేదు. గుంటూరు ఛానల్ ద్వారా నీరందించే ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. తెనాలి నియోజకవర్గం ఖాజీపేటలో అధికారులు, ప్రభుత్వం నుంచి స్పందన లేని పరిస్థితుల్లో రైతులే డబ్బు పోగేసుకుని కాలువలు బాగు చేయించుకున్నారు. చింతపల్లిపాడు గ్రామంలో కనీసం కాలువలకు మరమ్మతులు లేవని మహిళా రైతులు చెబుతున్నారు. కాలువలకు మరమ్మత్తులు చేయలేని ఈ ప్రభుత్వం వర్షాలు వచ్చే సమయానికి నిధులు కేటాయించామంటూ కబుర్లు చెబుతారు. 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించే గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించాలి. ఇది ఎన్నికల కోసం ఇచ్చే హామీ కాదు. స్పందించే మనసులేని ముఖ్యమంత్రి, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు స్వార్ధపూరిత ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. రూ. 3 లక్షల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేశామని చెబుతున్నారు. మీరు చేసిన సంక్షేమం ఎవరికి ఉపయోగపడింది. మనకి సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ రూపంలో వనరులు ఉన్నా నీరు లేదు. జనసేన పార్టీ మీ వెంట ఉంటుంది. జనసేన ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతుంది. నల్లమడ రైతు సంఘం నిర్వహిస్తున్న ఈ కార్యకమ్రమాన్ని గ్రామ స్థాయిలో ప్రజలకు తెలియచేయండి.. ఈ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఏ స్థాయిలో నష్టం జరుగుతోంది.. నీటిపారుదల శాఖకు కేటాయించిన నిధులు ఎందుకు ఖర్చు చేయడం లేదు? తెలియచేయాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానికి ఉంది. గుంటూరు ఛానల్ సమస్య పరిష్కారానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అండగా నిలుస్తామ”ని అన్నారు.
అనంతరం సీపీఎస్ రద్దు చేసి పాత ఫించన్ విధానం అమలు చేయలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న పోరాట శిబిరం వద్దకు వెళ్లి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సంఘీభావం తెలిపారు. సీపీఎస్ రద్దు హామీకి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు, కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు శ్రీ సయ్యద్ జిలానీ, శ్రీ నయూబ్ కమాల్, గుంటూరు నగర అధ్యక్షులు శ్రీ నేరెళ్ల సురేష్, గుంటూరు జిల్లా కార్యవర్గం, మండల కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.